ఆరోగ్య తెలంగాణ... బీజేపీ దార్శనికత

25 Oct, 2018 01:13 IST|Sakshi

అభిప్రాయం

భారత ప్రధాని నరేంద్రమోదీ 14 ఏప్రిల్, 2018న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ జయంతి రోజున ‘ఆయుష్మాన్‌  భారత్‌’ అనే పథకాన్ని ప్రకటించారు. 25 సెప్టెంబర్, 2018 తేదీన  పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. 2022 నాటికి అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చదిద్దడమే దీని ముఖ్యలక్ష్యం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1,50,000 ‘వెల్‌నెస్‌ సెంటర్లు’ ఏర్పాటు కానున్నాయి. ఇవి  సమగ్ర ఆరోగ్య సంరక్షణ కల్పించడంతో బాటు రోగులకు ఔషధాలు అందిస్తూ విశ్లేషణ సేవలు అందించడానికి బాధ్యత వహిస్తాయి. వీటి ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వం రూ. 1,200 కోట్లు కేటాయించింది.

తద్వారా దేశవ్యాప్తంగా ‘ఆరోగ్య అవస్థాపన’ పెద్ద ఎత్తున సామాన్య గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి రానున్నది. ‘జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం’ కోసం 10 కోట్ల మంది నిరుపేద కుటుంబాలకు రూ. 10,500 కోట్లను  మోదీ  ప్రభుత్వం ఇప్పటికే మంత్రివర్గం ద్వారా మంజూరు చేసింది. అర్హులైన పేద ప్రజలు వైద్యం కోసం ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండానే వారికి కూత వేటు దూరంలోనే ఈ ‘వెల్‌నెస్‌ సెంటర్లు’ ఏర్పాటవుతాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారితోపాటు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాల వారు పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అర్హులు.

ఒకవైపు ఉన్నత వర్గాలవారు, ఆర్థికంగా అవకాశం ఉన్నవారు ప్రైవేటు ఆసుపత్రులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఉండగా, మరోవైపు పేదవర్గాల వారు కనీసం మందులు కూడా కొనే స్థితిలో లేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో తక్షణంగా ప్రజలు ఆరోగ్యాన్ని సమకూర్చుకోవడానికి అవసరమైన డబ్బును కేటాయించడం, ఆ తరువాత జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని బలోపేతం చేసి, వాటి ద్వారా పూర్తి స్థాయిలో సేవలను వినియోగించుకునే విధంగా చేయడం రెండవ కర్తవ్యంగా చేపట్టాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది.

ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వైద్యసహాయం కల్పిస్తూ దేశవ్యాప్తంగా పది కోట్ల  కుటుంబాలకు సహాయం అందించనుంది. ఈ పథకం ప్రకారం 2018 నుంచి ప్రారంభించి 2022లో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి. లబ్ధిదారుడు ప్రతి సంవత్సరం ఈ పథకంలో కట్టాల్సిన ప్రీమియం రూ. 2,000ల్లో కేంద్ర ప్రభుత్వం 60% అంటే రూ. 1,200లు, రాష్ట్రాలు 40 శాతం అంటే రూ. 800లు భరిస్తాయి. కానీ, ప్రజలకు మేలు చేసే ఈ పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరకపోవడం బాధాకరం. 

ప్రస్తుతం మెడిక్లెయిం పాలసీలో 5 లక్షల రూపాయల వైద్య బీమా ప«థకానికి వినియోగదారుడు సుమారు 10 వేల రూపాయల ప్రీమియం చెల్లిస్తుండగా, ‘ఆయుష్మాన్‌ భారత్‌’ ప«థకం ద్వారా విని యోగదారుడు 80% ఆదా చేసుకుంటూ కేవలం రూ. 2,000లు చెల్లించి కుటుంబం సభ్యులందరికీ వైద్య బీమా సదుపాయం పొందవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ‘ఆరోగ్యశ్రీ’ పథకానికి ఏటా 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఒక కుటుంబానికి సంవత్సరానికి 3 లక్షల రూపాయల వరకు మాత్రమే బిల్లు చెల్లిస్తున్నారు.

కానీ ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకంలో కుటుంబానికి 5 లక్షల రూపాయలు వైద్య ఖర్చులను చెల్లిస్తారు. రాష్ట్రంలోని మెుత్తం  80 లక్షల కుటుంబాలకు ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకం అమలు చేసినా సంవత్సరానికి 640 కోట్ల రూపాయలే ఖర్చు అవుతుంది. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 70 కోట్ల రూపాయలు మిగిలే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోకుండా ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకంలో చేరి ఆరోగ్య  తెలంగాణను త్వరలో నిర్మించవచ్చు.

ప్రతి వ్యక్తి జీవితం విలువైనదని బీజేపీ భావి స్తుంది, ఎక్కడైనా ప్రమాదం సంభవిస్తే 10 నిమిషాల్లో అంబులెన్స్‌ చేరుకొని దగ్గరలోని ఆస్పత్రిలో చేర్చాలనేది బీజేపీ సంకల్పం. రాబోయే నాలుగేళ్ల (2022  కల్లా)లో బాధలు లేని తెలంగాణను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 2018 జనవరి ‘అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన’లో నేను ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ కార్యక్రమం కింద స్వయం ఉపాధి కోసం 50 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో సంప్రదాయ చికిత్సలైన (1) ఆయుర్వేద, (2) హోమియోపతి, (3) యునాని, (4) యోగా, (5 ) ప్రకృతి చికిత్స, (6) సిద్ధ చికిత్స పద్ధతితో పాటు ఇతర వ్యక్తిగత, సామూహిక సాంప్రదాయ చికిత్సలకు ప్రోత్సాహాన్నిచ్చి ఆరోగ్య, సిరి సంపదలను సృష్టిస్తాము.

వ్యాసకర్త : ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ

మరిన్ని వార్తలు