వాషింగ్ మెషీన్ల విపణిలో 40% వాటా: శాంసంగ్

8 Jun, 2016 01:32 IST|Sakshi
వాషింగ్ మెషీన్ల విపణిలో 40% వాటా: శాంసంగ్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా యాక్టివ్ వాష్ ప్లస్, యాడ్ వాష్ శ్రేణిలో నూతన వాషింగ్ మెషీన్లను హైదరాబాద్ వేదికగా భారత విపణిలోకి ప్రవేశపెట్టింది. ధరల శ్రేణి రూ.18,590-59,990గా ఉంది. వాషింగ్ పౌడర్ పూర్తిగా కరిగేలా ‘కె’ సిరీస్ టాప్‌లోడ్ మోడళ్లలో మ్యాజిక్ డిస్పెన్సర్‌తో పాటు బిల్ట్ ఇన్ సింక్‌ను పొందుపరిచారు. బట్టలు ఉతికే సమయంలో వస్త్రాలను అదనంగా జోడించేందుకు ఫ్రంట్‌లోడ్ మోడళ్లలో ముందు డోర్‌కు మరో చిన్నపాటి డోర్‌ను భారత్‌లో తొలిసారిగా ఏర్పాటు చేశారు.

టాప్‌లోడ్ వాషింగ్ మెషీన్ల విభాగంలో కంపెనీ వాటా గతేడాది 5% పెరిగి 35 శాతానికి చేరిందని శాంసంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భుటానీ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. 2016లో 40% వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. ఫ్రంట్ లోడ్ విభాగంలోనూ సుస్థిర వాటా దక్కించుకుంటామన్నారు. భారత్‌లో వాషింగ్ మెషీన్ల విపణి విలువ రూ.7,500 కోట్లుంది. ఇందులో ఫుల్లీ ఆటోమేటిక్ విభాగం వాటా 58 శాతముంది.

మరిన్ని వార్తలు