‘కార్డ్‌’లో ఎస్‌బీఐ వాటా పెంపు

29 Mar, 2017 00:52 IST|Sakshi
‘కార్డ్‌’లో ఎస్‌బీఐ వాటా పెంపు

న్యూఢిల్లీ: క్రెడిట్‌ కార్డ్స్‌ సంస్థ ఎస్‌బీఐ కార్డ్‌లో జూన్‌ నాటికల్లా వాటాలను 74 శాతానికి పెంచుకోనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది. ప్రస్తుతం కొన్ని నియంత్రణపరమైన అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు ’ఎస్‌బీఐ కార్డ్‌ ఉన్నతి’ని ఆవిష్కరించిన సందర్భంగా ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌ అరుంధతి భట్టాచార్య తెలిపారు. జనరల్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీతో రెండు క్రెడిట్‌ కార్డు జాయింట్‌ వెంచర్స్‌లో వాటాలను 74 శాతానికి పెంచుకునే ప్రతిపాదనలకు ఎస్‌బీఐ బోర్డు ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది.

వీటి ప్రకారం ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ (ఎస్‌బీఐసీపీఎస్‌ఎల్‌), జీఈ క్యాపిటల్‌ బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (జీఈసీబీపీఎంఎస్‌ఎల్‌)లో సుమారు రూ. 1,160 కోట్లతో జీఈ క్యాపిటల్‌ ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా ఎస్‌బీఐ తమ వాటాలను పెంచుకోనుంది. మిగతా 26% వాటాలపై వచ్చే నెలరోజుల్లోగా జీఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అరుంధతీ భట్టాచార్య తెలిపారు. జీఈ క్యాపిటల్‌ ఇండియాతో కలిసి ఎస్‌బీఐ 1998లో క్రెడిట్‌ కార్డ్‌ వ్యాపారంలో ప్రవేశించింది. ప్రస్తుతం ఎస్‌బీఐకి... ఎస్‌బీఐసీపీఎస్‌ఎల్‌ లో 60%, జీఈసీబీపీఎంఎస్‌ఎల్‌లో 40% వాటాలు ఉన్నాయి. ఈ రెండింట్లోనూ మిగతా వాటాలు జీఈ క్యాపిటల్‌ చేతిలో ఉన్నాయి. ఎస్‌బీఐ కార్డ్స్‌ నుంచి వైదొలగాలని జీఈ క్యాపిటల్‌ యోచిస్తోంది.

ఉన్నతి కార్డ్‌ ప్రత్యేకతలు..
నగదురహిత లావాదేవీల పరిధిలోకి మరింత మంది కొత్త యూజర్లను చేర్చే లక్ష్యంతో ఉన్నతి కార్డ్‌ను ఎస్‌బీఐ కార్డ్‌ ప్రవేశపెట్టింది. జన ధన ఖాతాదారులు సహా ఎస్‌బీఐ కస్టమర్లందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. ఖాతాలో రూ. 25,000 బ్యాలెన్స్‌ ఉండే వారికి ఈ కార్డును జారీ చేయనున్నట్లు అరుంధతీ భట్టాచార్య తెలిపారు. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో నాలుగేళ్ల పాటు ఎటువంటి వార్షిక ఫీజు లేకుండా ఉచితంగా ఈ కార్డును అందించనున్నట్లు ఆమె వివరించారు. గతంలో క్రెడిట్‌ హిస్టరీ లేని కొత్త యూజర్ల క్రెడిట్‌ కార్డ్‌ అవసరాలను తీర్చేందుకు ’ఉన్నతి’ ఉపయోగపడగలదని భట్టాచార్య చెప్పారు.

మూడు నెలల్లో విలీనం పూర్తి: ఎస్‌బీఐ
ఎస్‌బీఐలో ఆరు బ్యాంకుల విలీనం మూడు నెలల్లో పూర్తి కానుంది. ఆర్‌బీఐ నుంచి మూడు నెలల సమయం కోరామని, ఆలోపు పూర్తి చేస్తామని ఎస్‌బీఐ ఎండీ రజనీష్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ ప్రక్రియ దశలవారీగా జరుగుతుందని, ముందు డేటాను ఒక్కటి చేయడం, ఖాతాదారులకు కొత్తగా పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు జారీ చేస్తామని పేర్కొన్నారు. విలీనం అనంతరం ఒకే ప్రాంతంలో ఒకటికి మించి ఉన్న 1,500 – 1600 శాఖలను మూసివేయడం జరుగుతుందన్నారు. చాలా ప్రాంతాల్లో ఒకటికి మించిన శాఖలున్నాయన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్, భారతీయ మహిళా బ్యాంకు ఏప్రిల్‌ 1న కలిసిపోనున్నాయి.

మరిన్ని వార్తలు