ఐటీ.. క్యూ2లోనూ చప్పగానే?

6 Oct, 2017 00:32 IST|Sakshi

ఫలితాలపై విశ్లేషకుల అంచనా

ఇన్ఫోసిస్‌ గైడెన్స్‌ తగ్గొచ్చు

ఇంకా మెరుగుపడని పరిస్థితులు

ఫలితాల సీజన్‌కు 12న టీసీఎస్‌ బోణీ

న్యూఢిల్లీ: దేశీ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాల సీజన్‌ ఆరంభమవుతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత  నెలకొన్న ప్రతికూల పరిస్థితులు సర్దుకోలేదు. ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్‌టీతో కొంత గందరగోళం, అనిశ్చితి నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటి త్రైమాసిక కాలంలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తాజా ఫలితాలతో వెల్లడయ్యే అవకాశముంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఐటీ కంపెనీలు మరోసారి సెప్టెంబర్‌ త్రైమాసికంలోనూ ఫలితాల పరంగా మెప్పించే పరిస్థితులు లేవన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇందుకు అంతర్జాతీయంగా ఐటీపై వ్యయాలు మెరుగుపడకపోగా, తగ్గించుకుంటున్న ధోరణి కొనసాగడమే కారణమన్నది వారి వాదన.

ఐటీ కంపెనీల్లో ముందుగా ఈ నెల 12న టీసీఎస్‌ ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇన్ఫోసిస్‌ ఈ నెల 24న ఫలితాలను ప్రకటించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాలను ఇన్ఫోసిస్‌ తగ్గిస్తుందని గట్టి అంచనాలున్నాయి. రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగానికి చెందిన క్లయింట్లు తమ ఐటీ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడంతో అనలిస్టులు ఈ అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఐటీ రంగానికి వ్యాపార వృద్ధి నత్తనడకను తలపిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు రక్షణాత్మక విధానాలను అనుసరిస్తుండటం, నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకోవడం వంటి భిన్న పరిస్థితులను ఈ రంగం ఎదుర్కొంటోంది. నిజానికి రెండో త్రైమాసికంలో బ్యాంకింగ్‌ రంగం ఆదుకుంటుందని ఐటీ కంపెనీలు ఆశపడ్డాయి. కానీ వాస్తవంలో ఆ పరిస్థితులు లేకపోవడం గమనార్హం.

బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి ఆదాయాలు పుంజుకోలేదని ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్‌ కంపెనీలు పేర్కొన్నాయి. రిటైల్‌ పరంగా చూసుకుంటే టీసీఎస్‌ క్లయింట్‌ టోయ్స్‌ ఆర్‌యూ సహా పలు కంపెనీలు దివాలా స్థితికి చేరడం ఐటీ కంపెనీల ఆశల్ని దెబ్బకొట్టాయి. దేశీయ ఐటీ కంపెనీలకు ఆదాయాల పరంగా రిటైల్‌ రంగం రెండో అతిపెద్ద విభాగంగా ఉన్న విషయం గమనార్హం.


ఫలితాల షెడ్యూల్‌...
కంపెనీ            తేదీ
టీసీఎస్‌      అక్టోబర్‌ 12
సైయంట్‌     అక్టోబర్‌ 12
విప్రో          అక్టోబర్‌ 17
ఇన్ఫోసిస్‌    అక్టోబర్‌ 24
ఎంఫసిస్‌    అక్టోబర్‌ 26
పొలారిస్‌    నవంబర్‌ 7

మరిన్ని వార్తలు