35,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్‌

6 Nov, 2018 02:12 IST|Sakshi

నష్టాల్లో ఆసియా మార్కెట్లు

ఇంట్రాడేలో 67 పైసలు పతనమైన రూపాయి

61 పాయింట్ల నష్టంతో 34,951కు సెన్సెక్స్‌

29 పాయింట్లు తగ్గి 10,524కు నిఫ్టీ

రూపాయి పతనానికి తోడు చైనా– అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలపై అనిశ్చితి ప్రతికూల ప్రభావం చూపడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తరలిపోతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిన్నది. సెన్సెక్స్‌ మళ్లీ 35,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. చివర్లో కొనుగోళ్లు పుంజుకోవడంతో నష్టాలు తగ్గాయి. సెన్సెక్స్‌ 61 పాయింట్లు నష్టపోయి 34,951 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 29 పాయింట్లు తగ్గి 10,524 పాయింట్ల వద్ద ముగిశాయి.

వాహన, వినియోగ, మౌలిక, ఫార్మా షేర్లు నష్టపోగా, ప్రభుత్వ రంగ బ్యాంక్, ఐటీ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆరంభంలోనే 112 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌...ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడ్‌ కావడం, రూపాయి పతనం కావడం తదితర కారణాల వల్ల వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో 200 పాయింట్ల నష్టంతో 34,812 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. రోజంతా 312 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 76 పాయింట్ల వరకూ నష్టపోయింది.

అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహన రంగ షేర్లలో అమ్మకాల కారణంగా స్టాక్‌సూచీలు పరిమిత శ్రేణిలో ఒడిదుడుకులకు గురయ్యాయని విశ్లేషకులు పేర్కొన్నారు.  డాలర్‌తో రూపాయి మారకం  ఇంట్రాడేలో 67 పైసలు పతనమై 73.12 కనిష్ట స్థాయిని తాకింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల నిర్ణయం నేపథ్యంలో, మార్కెట్‌కు రెండు రోజుల సెలవులు (బుధ, గురు) రావడంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. ఇక ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీ 2 శాతం,  జపాన్‌ నికాయ్‌ 1.5 శాతం, దక్షిణ  కొరియా కోస్పి 0.9 శాతం, షాంగై సూచీ 0.4 శాతం చొప్పున నష్టపోయాయి.  

ఈ క్యూ2లో రూ.945 కోట్ల నికర లాభం సాధించడంతో ఎస్‌బీఐ 3.4 శాతం ఎగసి రూ.295 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  

ఈ నెలాఖర్లో సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఎఫ్‌పీఓ
సీపీఎస్‌ఈ ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్‌) ఫాలో ఆన్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ) ఈ నెలాఖరులో ఉండొచ్చని ఆర్థిక శాఖ అధికారి చెప్పారు. ఈ ఎఫ్‌పీఓ ద్వారా రూ.8,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 10 షేర్లతో కూడిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ద్వారా కేంద్రం నిధులు సమీకరించడం ఇది నాలుగోసారి.

మరిన్ని వార్తలు