రూపీ రికవరీతో లాభాలు

8 Sep, 2018 01:29 IST|Sakshi

రూపాయి స్వల్పంగా రికవరీ కావడం, వాహన షేర్ల జోరుతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. వరుసగా రెండో రోజూ స్టాక్‌ సూచీలు పెరిగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 147 పాయింట్లు లాభపడి 38,390 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 11,589 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫార్మా, వాహన, ఇంధన షేర్లు లాభపడగా, బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. అయితే వారం పరంగా చూస్తే, స్టాక్‌ సూచీలు నష్టపోయాయి. దీంతో ఆరు వారాల అప్రతిహత లాభాలకు బ్రేక్‌ పడింది. ఈ వారంలో సెన్సెక్స్‌ 255 పాయింట్లు, నిఫ్టీ 91 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  

355 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌  
డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో జీవిత కాల కనిష్ట స్థాయి, 72.11ను తాకినప్పటికీ, ఆ తర్వాత రికవరీ కావడం సానుకూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్‌ లాభాల్లోనే ప్రారంభమైంది. ఆసియా మార్కెట్ల బలహీనతతో వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. 176 పాయింట్ల నష్టంతో 38,067 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. డాలర్‌తో రూపాయి మారకం బలపడటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌ వచ్చింది. దీంతో కొనుగోళ్ల జోరు పెరిగింది. 179 పాయింట్ల లాభంతో 38,422 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో గరిష్ట స్థాయిని తాకింది.  మొత్తం మీద రోజంతా సెన్సెక్స్‌ 355 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. రూపాయి రికవరీ కావడం, ముడి చమురు ధరలు దిగిరావడంతో స్టాక్‌ సూచీలు నష్టాలను పూడ్చుకొని లాభపడ్డాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. అయితే విలువ పరంగా చూస్తే, ఇప్పటికీ పలు షేర్లు ఖరీదైనవేనని ఆయన అంగీకరించారు. వృద్ది జోరు పెరగడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలు పతనానికి అడ్డుకట్ట వేస్తున్నాయని వివరించారు.  

వాహన షేర్లు రయ్‌... 
వాహన షేర్లు రయ్‌మని దూసుకుపోయాయి. ఎలక్ట్రిక్, ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు పర్మిట్లు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో వాహన కంపెనీల షేర్లు దూసుకుపోయాయి. హీరో మోటొకార్ప్‌ 5.2 శాతం లాభంతో రూ.3,327 వద్ద ముగిసింది. బజాజ్‌ ఆటో 5 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 4 శాతం, టాటా మోటార్స్‌ 2.8 శాతం, అశోక్‌ లేలాండ్‌ 1.5 శాతం, టీవీఎస్‌ మోటార్‌ 3.6 శాతం చొప్పున పెరిగాయి. చైనాపై తాజాగా సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.  
►సన్‌ ఫార్మా షేర్‌ 1.8 శాతం నష్టంతో రూ.664 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 5.2 శాతం నష్టపోయి రూ.641ను తాకింది. కంపెనీకి చెందిన హలోల్‌ ప్లాంట్‌ విషయమై అమెరికా ఎఫ్‌డీఏ ఆరు పరిశీలనలు వ్యక్తం చేసిందన్న వార్తల కారణంగా ఈ షేర్‌ పతనమైంది.  
►యస్‌ బ్యాంక్‌ షేర్‌ 4.5 శాతం నష్టపోయి నాలుగు నెలల కనిష్టానికి, రూ.323కు  పడిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అధికంగా నష్టపోయిన షేర్‌  ఇదే కావడం గమనార్హం. 
►  త్రీ వీలర్, క్వాడ్రిసైకిల్‌ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోనున్నదన్న వార్తల కారణంగా బజాజ్‌ ఆటో షేర్‌ 5 శాతం ఎగసి రూ.2,924కు చేరింది.  
►అమెరికాకు చెందిన శాండోజ్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసిన నేపథ్యంలో అరబిందో ఫార్మా షేర్‌5.4 శాతం లాభపడి రూ.801 వద్ద ముగిసింది. ఈ షేర్‌కు కొనవచ్చనే రేటింగ్‌ను కొనసాగిస్తూ, పలు బ్రోకరేజ్‌ సంస్థలు టార్గెట్‌ ధరను రూ.915కు పెంచాయి.  
► స్టాక్‌ మార్కెట్లో లిస్టై పాతికేళ్లైన సందర్భంగా ప్రతి 2 షేర్లకు 1 షేర్‌ను బోనస్‌గా (1:2) ఇవ్వనుండటంతో మదర్సన్‌ సుమి సిస్టమ్స్‌ షేర్‌ 5 శాతం పెరిగి రూ.306కు చేరుకుంది. 
►స్టాక్‌ మార్కెట్‌ లాభపడినప్పటికీ, పలు షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. సన్‌ టీవీ నెట్‌వర్క్, జేపీ ఇన్‌ఫ్రాటెక్, యూనిటెక్, సెంచురీ ప్లే బోర్డ్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేంద్రానికి ఆర్‌బీఐ 28 వేల కోట్లు!

పుల్వామా ప్రకంపనలు

పెట్రోలు ధర రూ.5 లు తగ్గింపు

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ఫిబ్రవరి 21న బ్యాంకు సీఈవోలతో భేటీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ప్రేమ సందేశాలు

అందుకే వద్దనుకున్నా!

హత్య చేసిందెవరు?