ఆగని అమ్మకాలు...

14 May, 2019 05:05 IST|Sakshi

9వ రోజూ నష్టాలు  

సెన్సెక్స్‌ 372 పాయింట్లు డౌన్‌  

 నిఫ్టీ 131 పాయింట్ల తగ్గుదల  

మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఉధృతి కొనసాగుతోంది. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లు వరుసగా తొమ్మిదో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. ఎన్‌బీఎఫ్‌సీ రంగంపై తాజా ఆందోళనలు, అమెరికా– చైనా వాణిజ్య ఒప్పందంపై నీలి నీడలు, ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయా? అన్న సందేహాలు అమ్మకాలకు కారణమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 372 పాయింట్లు నష్టపోయి (ఒక శాతం) 37,090.82కు చేరింది. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 131 పాయింట్లు కోల్పోయి (1.16 శాతం) 11,148 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 11,125 కనిష్ట స్థాయి, 11,300 గరిష్ట స్థాయి వరకు వెళ్లింది. విదేశీ ఇన్వెస్టర్లు సోమవారం రూ.1,057 కోట్ల విలువ మేర నికర అమ్మకాలు జరపగా, దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు ఇంతే మేర నికరంగా పెట్టుబడులు పెట్టారు. గత తొమ్మిది సెషన్లలో సెన్సెక్స్‌ 1,940 పాయింట్లు, నిఫ్టీ 600 పాయింట్ల మేర కోల్పోయాయి. 

సన్‌ఫార్మా విలవిల  
ప్రధాన సూచీల్లోని ఐటీసీ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు తదితర కౌంటర్లలో తీవ్ర అమ్మకాలు నష్టాలకు దారితీశాయి. శాతం వారీగా చూస్తే సన్‌ఫార్మా అత్యధికంగా 9.39 శాతం మేర పతనమయింది. ఇంట్రాడేలో ఈ షేరు 20 శాతం వరకు క్షీణించడం గమనార్హం. సెన్సెక్స్‌లోని యస్‌ బ్యాంకు, టాటా స్టీల్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు ఎక్కువగా నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ మాత్రం ఒక శాతం లాభపడింది. హెల్త్‌కేర్, క్యాపిటల్‌ గూడ్స్, పవర్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, మెటల్, ఆటో, ఎనర్జీ, బ్యాంకింగ్‌ సూచీలు మూడున్నర శాతం వరకు క్షీణించాయి. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్‌ మాత్రం లాభపడింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ 2.15 శాతం వరకు తగ్గాయి. అమెరికా–చైనా మధ్య వాణిజ్య చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా శుక్రవారం ముగియడంతో ఆసియా వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడవడం దేశీయ మార్కెట్లపైనా ప్రభావం చూపించింది. యూరోప్‌ మార్కెట్లు కూడా నష్టాలతోనే ఆరంభమయ్యాయి.  

ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం... 
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల రంగంలో సమీపంలోనే సంక్షోభం రానుందని, పెద్ద సంస్థలు చేసిన దుస్సాహసాలు, రుణాలకు కొరత అన్నవి సంక్షోభానికి కచ్చితమైన వాహకాలుగా కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలు కొత్త ఆందోళనకు తావిచ్చాయి.

ఎన్నికల ఫలితాలపైనే ఆశలు 
‘‘అంతర్జాతీయ ఆందోళనలకు తోడు లిక్విడీ కొరతపైనా మార్కెట్లలో ఆందోళన నెకొంది. ఎన్నికల ఫలితాలు సానుకూలంగా ఉంటే పెట్టుబడుల ప్రవాహం మార్కెట్లను గరిష్టాలకు నడిపించొచ్చు’’ అని శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీఐవో సునీల్‌ శర్మ తెలిపారు. 

ఫార్మా స్టాక్స్‌ల్లో అమ్మకాలు
హెల్త్‌కేర్‌ కంపెనీల స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా సన్‌ఫార్మా 9 శాతానికి పైగా నష్టంతో 396కు చేరింది. ఒక దశలో ఇంట్రాడేలో నూతన 52 వారాల కనిష్ట స్థాయి రూ.350.40 వరకు పడిపోయింది. క్యాడిలా హెల్త్‌కేర్‌ 7 శాతం, సన్‌ఫార్మా అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ 6.37 శాతం, వోకార్డ్‌ 5.57 శాతం, లుపిన్‌ 4.24 శాతం, గ్లెన్‌మార్క్‌ ఫార్మా 4 శాతానికి పైగా నస్టపోయాయి. అమెరికాలో తెవా ఫార్మాస్యూటికల్స్, 19 జనరిక్‌ కంపెనీలకు వ్యతిరేకంగా లాసూట్‌ దాఖలైందన్న మీడియా కథనాలు అమ్మకాలకు కారణమయ్యాయి. 

మరిన్ని వార్తలు