మళ్లీ కొత్త శిఖరాలకు సూచీలు

4 Nov, 2017 01:10 IST|Sakshi

ఇంట్రాడేలో, ముగింపులో కొత్త రికార్డ్‌లు

112 పాయింట్ల లాభంతో 33,686కు సెన్సెక్స్‌

29 పాయింట్ల లాభంతో 10,452కు నిఫ్టీ  

ఒక రోజు విరామం తర్వాత స్టాక్‌ సూచీలు మళ్లీ కొత్త శిఖరాలకు చేరాయి. పెట్టుబడుల ప్రవాహం జోరుగా కొనసాగుతుండడం, సేవల రంగం పీఎంఐ గణాంకాలు సానుకూలంగా ఉండడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలో, ముగింపులో కూడా కొత్త గరిష్ట స్థాయిలను తాకాయి.

సెన్సెక్స్‌ తొలిసారిగా 33,700 పాయింట్లపైకి ఎగబాకగా, నిఫ్టీ 10,450 పాయింట్లపైన ముగిసింది. అంచనాలను మించని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ క్యూ2 ఫలితాల వెల్లడి తర్వాత బ్యాంక్‌ షేర్లు పుంజుకోవడం కలసి వచ్చింది. సెన్సెక్స్‌ 112 పాయింట్ల లాభంతో 33,686 పాయింట్ల వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 10,453  పాయింట్ల వద్ద ముగిశాయి.

కొత్త ఆర్డర్లు పెరగడం, డిమాండ్‌ పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో అక్టోబర్‌ నెల సర్వీసుల రంగం పెరిగింది. సర్వీసుల రంగం పీఎంఐ పెరగడం ఇది వరుసగా రెండో నెల.  మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌గా జెరోమి పావెల్‌ నియామకం, అలాగే ట్రంప్‌ ప్రభుత్వ పన్ను సంస్కరణలు ప్రోత్సాహకరంగా ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండడం కూడా కలసివచ్చింది.

కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్‌ శుక్రవారం ఇంట్రాడేలో 160 పాయింట్ల లాభంతో 33,734 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. మరో దశలో 41 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ 10,462 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. . ఇవి రెండూ ఈ సూచీలకు ఇంట్రాడే జీవిత కాల గరిష్ట స్థాయిలు. ఇక వారం పరంగా చూస్తే, స్టాక్‌ సూచీలు వరుసగా రెండో వారం మంచి లాభాలు సాధించాయి.

మరిన్ని వార్తలు