చమురు సెగ

13 Nov, 2018 00:46 IST|Sakshi

భగ్గుమన్న ముడి చమురు ధరలు

మళ్లీ పతనమైన రూపాయి

గణాంకాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ

35 వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్‌

346 పాయింట్ల నష్టంతో 34,813 పాయింట్లకు..

10,500 పాయింట్ల దిగువకు నిఫ్టీ

103 పాయింట్లు పతనమై 10,482 వద్ద ముగింపు

రూపాయి పతనం మళ్లీ ఆరంభం కావడం, గత వారం చల్లబడిన చమురు ధరలు మళ్లీ భగ్గుమనడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. ట్రేడింగ్‌ చివరి గంటలో వాహన, ఇంధన షేర్లలో అమ్మకాలు జోరుగా జరగడంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 10,500 పాయింట్ల దిగువకు, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 35వేల పాయింట్ల దిగువకు  పడిపోయాయి.

ఆరంభ లాభాలను స్టాక్‌ సూచీలు నిలుపుకోలేకపోయాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 346 పాయింట్లు పతనమై  34,813 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 103 పాయింట్లు క్షీణించి 10,482 పాయింట్ల వద్ద ముగిశాయి. వాహన, ఆయిల్, గ్యాస్, ప్రభుత్వ రంగ కంపెనీలతో పాటు బ్యాంక్, లోహ, రియల్టీ  షేర్లు కూడా నష్టపోయాయి.

ముడి చమురు మంటలు
గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన ముడి చమురు ధరలు సోమవారం భగ్గుమన్నాయి. ఒక బ్యారెల్‌ బ్రెంట్‌  చమురు 2 శాతం ఎగసి 71.62 డాలర్లకు పెరిగింది. గత నెల నుంచి చూస్తే, చమురు ధరలు 20 శాతం వరకూ తగ్గాయి. చమురు ధరల పతనం నేపథ్యంలో వచ్చే నెల నుంచి చమురు ఉత్పత్తిని తగ్గిస్తామని సౌదీ అరేబియా ప్రకటించడంతో ధరలు ఎగిశాయి. దీంతో డాలర్‌ మారకంలో  రూపాయి విలువ నష్టపోయింది.

ఇంట్రాడేలో దేశీయ కరెన్సీ 73 మార్క్‌ను దాటింది. 57 పైసలు నష్టపోయింది. మరోవైపు సెప్టెంబర్‌ పారిశ్రామికోత్పత్తి, అక్టోబర్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనుండటంతో (మార్కెట్‌ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వచ్చాయి) ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ఆరంభం కావడం ప్రతికూల ప్రభావం చూపించాయి.  

ఇంట్రాడేలో 402 పాయింట్ల నష్టం...
సెన్సెక్స్‌ మంచి లాభాల్లోనే ఆరంభమైంది. గత నెలలో ఈక్విటీలను తెగనమ్మిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో నికర కొనుగోలుదారులుగా నిలిచారన్న వార్తల కారణంగా ఆరంభంలో  కొనుగోళ్ల జోరుగా సాగాయి. సెన్సెక్స్‌ 174 పాయింట్ల లాభంతో 35,333 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయింది. 401 పాయింట్ల నష్టంతో 34,757 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.  మొత్తం మీద రోజంతా  576 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 61 పాయింట్లు లాభపడగా, మరో దశలో 121 పాయింట్లు నష్టపోయింది.  

ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్, విమానయాన కంపెనీల షేర్లు పతనమయ్యాయి. హెచ్‌పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్‌ షేర్లు 7 శాతం వరకూ నష్టపోయాయి.   
టాటా మోటార్స్‌ షేర్‌ 4.8 శాతం నష్టంతో రూ.186 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌  ఇదే. గత నెలలో ఈ కంపెనీకి చెందిన జేఎల్‌ఆర్‌ రిటైల్‌ అమ్మకాలు 5 శాతం తగ్గడంతో ఈ షేర్‌ పతనమైంది. 

మరిన్ని వార్తలు