సెన్సెక్స్ మద్దతు శ్రేణి 27,700-27,800

17 Nov, 2014 00:06 IST|Sakshi

కార్పొరేట్ ఫలితాల సీజన్ దాదాపు ముగిసింది. ఒక్క ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ మినహా మార్కెట్ అంచనాలకు మించిన ఫలితాలు వెల్లడించిన కంపెనీ ఏదీ లేదు. అలాగే మార్కెట్‌ను తీవ్ర నిరుత్సాహానికి లోనుచేసిన కంపెనీ కూడా లేదు. అందుకే ఆర్థిక ఫలితాల ప్రభావం గత ఆరువారాల నుంచి సూచీలపై పెద్దగా పడలేదు.  

అంతర్జాతీయంగా కొనసాగుతున్న పాజిటివ్ ట్రెండ్, క్రూడ్ ధరల తగ్గుదల వంటి అంశాలు భారత్ సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. కానీ గత శుక్రవారం నాటకీయంగా ముడిచమురు, బంగారం హఠాత్తుగా కనిష్టస్థాయి నుంచి పెద్ద ర్యాలీ జరిపాయి. ఇదేరోజున డాలరుతో రూపాయి మారకపు విలువ నెలరోజుల కనిష్టస్థాయికి పడిపోయింది. ఒకవైపు కమోడిటీ ధరలు పెరగడం, మరోవైపు రూపాయి క్షీణించడం భారత్ స్టాక్ మార్కెట్‌ను ఆందోళనపర్చే అంశం. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే...
 
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
నవంబర్14తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గుల కు లోనై చివరకు 28,000 పాయింట్ల శిఖరంపైన స్థిరపడగలిగింది. 28,126 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 178  పాయింట్ల లాభంతో 28,047 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం 28,000 స్థాయిపైన నిలదొక్కుకుంటే, క్రమేపీ కొద్దివారాల్లో 28,500-28,600 స్థాయిని అందుకోవొచ్చు.

ఈ శ్రేణిని అందుకునే ముందు, 28,150-28,250 పాయింట్ల శ్రేణి అవరోధాన్ని కల్పించవచ్చు. వచ్చే కొద్దిరోజుల్లో సెన్సెక్స్‌కు 27,700-27,800 మద్దతుశ్రేణి కీలకం. గత రెండు వారాల నుంచి ఈ మద్దతు సహకరాంతో పలుదఫాలు సూచీ బౌన్స్ అయినందున, ఈ శ్రేణిని కోల్పోతే  అక్టోబర్ 31నాటి గ్యాప్‌అప్‌స్థాయి 27,440-27,390 శ్రేణి వద్దకు క్షీణించవచ్చు.  ఈ మద్దతు శ్రేణి దిగువన ముగిస్తే 27,100-26,900 శ్రేణి వద్దకు తగ్గవచ్చు.

నిఫ్టీ మద్దతు శ్రేణి 8,290-8,320
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  8,360 పాయింట్ల అవరోధస్థాయిపైన ముగిసిన వెంటనే 8,415 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపింది.  చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 53 పాయింట్ల లాభంతో 8,390 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ 8,360 స్థాయిని పరిరక్షించుకోగలిగితే, 8,440-8,470 శ్రేణి వద్దకు ర్యాలీ జరపవచ్చు. అటుతర్వాత రానున్న వారాల్లో 8,500-8,550 శ్రేణిని చేరవచ్చు. 8,360 స్థాయి దిగువన రెండు వారాల నుంచి మద్దతు కల్పిస్తున్న 8,290-8,320 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి కీలకం. ఈ మద్దతు శ్రేణిని నష్టపోతే మార్కెట్ కరెక్షన్ బాటలోకి మళ్లవొచ్చు. ఆ లోపున క్రమేపీ  8,200-8,180 పాయింట్ల శ్రేణి వద్దకు క్షీణించవచ్చు.
 
 - పి. సత్యప్రసాద్

>
మరిన్ని వార్తలు