88 పాయింట్ల లాభం

26 Jun, 2013 17:35 IST|Sakshi

ముంబై: చైనా మార్కెట్  దెబ్బ నుంచి మంగళవారం మన స్టాక్ మార్కెట్లు కొంచెం కోలుకున్నాయి. రోజంతా ఒడిదుడుకులకు  గురైన సెన్సెక్స్ చివరకు 88 పాయింట్ల లాభంతో 18,629 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 5,609 వద్దకు చేరింది.  నిజానికి  260 పాయింట్ల లాభంలో ఉన్నప్పటికీ ముగింపునకు ఆఖరు అరగంటలో సెన్సెక్స్‌పై ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం చూపింది. దీనితో కొన్ని పాయింట్లను నష్టపోయి, చివరకు 88 పాయింట్ల వద్ద ముగిసింది.  దీనికితోడు ఎఫ్‌టీఎస్‌ఈ, డాక్స్ వంటి యూరోపియన్ సూచీల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలు, జూన్ 27న డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ వార్తలు మార్కెట్లకు లాభాలను అందించాయి.
 
 సెన్సెక్స్ షేర్లలో 16 లాభపడగా, మిగిలినవి నష్టాల్లో ముగిశాయి. స్పెక్ట్రం వేలం ధరపై మంత్రుల బృందం సమావేశం ఒక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తల నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ 4.34 శాతం లాభపడింది. మొజాంబిక్ గ్యాస్ క్షేత్రాల్లో వీడియోకాన్ 10 శాతం వాటాను 2.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు ఓవీఎల్-ఓఐఎల్ ప్రకటన నేపథ్యంలో ఓఎన్‌జీసీ 3.80 శాతం దూసుకుపోయింది.  ఎంఅండ్‌ఎం (3.18 శాతం), హిందాల్కో (2.76 శాతం), ఐటీసీ (1.84 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (1.43 శాతం), ఆర్‌ఐఎల్ (1.32 శాతం), ఎల్‌అండ్‌టీ (0.95 శాతం) లాభాపడ్డాయి.    కాగా ఎన్‌టీపీసీ (2.61 శాతం), టాటా పవర్ (2.07 శాతం), విప్రో (1.92 శాతం), ఎస్‌బీఐ (1.75 శాతం), హెచ్‌డీఎఫీసీ (1.59 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (1.56 శాతం), కోల్ ఇండియా (1.3 శాతం) బీహెచ్‌ఈఎల్ (1.15 శాతం) టీసీఎస్ (1.12 శాతం) నష్టపోయాయి. మరోవైపు బీఎస్‌ఈ-మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్  సూచీలు  నష్టాల్లో ముగిశాయి.
 
 పెరిగిన టర్నోవర్...
 మొత్తం మార్కెట్ విషయానికి వస్తే  981 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. 1,313 స్టాక్స్ నష్టపోయాయి. సోమవారంతో పోల్చితే మొత్తం టర్నోవర్ రూ.1,648 కోట్ల నుంచి రూ.1,930 కోట్లకు ఎగసింది. ఎన్‌ఎస్‌ఈ ఎఫ్‌అండ్‌వోలో రూ.2,38,736 కోట్లు, ఈక్విటీలో రూ.11,684 కోట్లుగా నమోదయ్యింది.
 
 భవిష్యత్ గురించి ఇలా...
 గురువారం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌ఓ) జూన్ కాంట్రాక్ట్ ముగింపు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో మార్కెట్ ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా