53 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

5 Jun, 2014 08:23 IST|Sakshi
53 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

ముంబై: ఐటీ, టెక్, రిఫైనరీ షేర్లలో విక్రయాల ఒత్తిడితో బీఎస్‌ఈ సెన్సెక్స్ బుధవారం 52.76 పాయింట్లు (0.21 శాతం) క్షీణించి 24,805.83 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 13.60 పాయింట్లు (0.18 శాతం) తగ్గి 7,402.25 పాయింట్ల వద్ద క్లోజైంది. సెన్సెక్స్ మంగళవారం 24,858.59 పాయింట్ల రికార్డు స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.575.09 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో భారీ కొనుగోళ్లతో సూచీ ఒక దశలో 24,925.90 పాయింట్లకు ఎగసింది. రంగాలవారీగా చూస్తే క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, మెటల్ షేర్ల కొనుగోలుకు బయ్యర్లు అమితాసక్తి చూపారు. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 15 పెరగ్గా, మిగిలిన సగం తగ్గాయి. సెన్సెక్స్ మంగళవారం రికార్డు స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడం కన్పించిందని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేశ్ చౌదరి తెలిపారు.బుధవారం 2,127 షేర్ల ధరలు పెరగ్గా 921 షేర్ల రేట్లు తగ్గాయి. 97 షేర్లు స్థిరంగా ఉన్నాయి. టర్నోవర్ రూ.4,467.78 కోట్లకు (మంగళవారం రూ.4,048.34 కోట్లు) పెరిగింది.

మరిన్ని వార్తలు