సత్తా చాటిన సేవల రంగం..

4 Dec, 2019 12:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో అన్ని రంగాలూ కుదేలవుతుంటే వృద్ధి రేటులో కీలక పాత్ర పోషించే సేవల రంగం నవంబర్‌లో సత్తా చాటింది. గత నాలుగు నెలల్లో ఎన్నడూ లేని రీతిలో సేవల రంగం వృద్ధిని కనబరచడం ఆర్థిక వ్యవస్థ గాడినపడుతుందనే సంకేతాలు పంపింది. నూతన వ్యాపారాలు ఊపందుకోవడం, పలు సేవలకు డిమాండ్‌ పెరుగుతున్న క్రమంలో సేవల రంగం గణనీయంగా వృద్ధి చెందుతోందని ప్రైవేట్‌ రంగానికి చెందిన నిక్కీఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ సర్వీసెస్‌ సర్వే వెల్లడించింది. నవంబర్‌లో పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ 52.7కు  ఎగబాకగా, అక్టోబర్‌లో ఇది 49.2గా నమోదైంది.

నూతన వ్యాపారాలతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగాయని సర్వే పేర్కొంది. సేవల కార్యకలాపాలు విస్తృతమవడంతో వ్యాపార విశ్వాసం ఇనుమడించిందని దీంతో నవంబర్‌ సర్వేలో మెరుగైన ఫలితాలు వచ్చాయని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ప్రధాన ఆర్థికవేత్త పాలిన్న డి లిమ పేర్కొన్నారు. వ్యవస్ధలో డిమాండ్‌ను మదించే సబ్‌ ఇండెక్స్‌ సైతం అక్టోబర్‌లో 501గా ఉండగా నవంబర్‌లో 53.2కు పెరిగింది. గత మూడు నెలల్లో సంస్థలు ఉద్యోగులను పెద్దసంఖ్యలో నియామకాలు చేపడుతున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో దేశ జీడీపీ కేవలం 4.5 శాతానికి పరిమితం కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సర్వే కొంత ఊరట కల్పించింది.

మరిన్ని వార్తలు