మైనింగ్‌కు సింగిల్ విండో విధానం కావాలి

15 Jun, 2014 01:35 IST|Sakshi
మైనింగ్‌కు సింగిల్ విండో విధానం కావాలి

ఎన్‌ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారి
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ సంస్థలు స్థల సమీకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నాయని మైనింగ్ దిగ్గజం ఎన్‌ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారి చెప్పారు. ప్రస్తుతం ఒక్కొక్క విభాగం నుంచి ఒక్కో అనుమతి తీసుకోవాల్సి వస్తున్నందున, ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల అనుమతులను వేగవంతం చేసే దిశగా సింగిల్ విండో విధానం అవసరమని తెలిపారు. ఇటు వృద్ధి, అటు పర్యావరణ పరిరక్షణ విధానాల మధ్య సమతౌల్యం పాటించే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
 
‘దేశ వృద్ధిలో మైనింగ్ కీలక పాత్ర’ అంశంపై శనివారం ఇక్కడ జరిగిన సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ఎన్‌ఎండీసీ ప్రస్తుత మైనింగ్ వార్షిక సామర్థ్యం 30 మిలియన్ టన్నులు ఉండగా.. దీన్ని 50 మిలియన్ టన్నులకు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరోవైపు, ఉక్కు రంగంలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా దాదాపు రూ. 15,000 కోట్ల పైచిలుకు ఇన్వెస్ట్‌మెంట్‌తో తలపెట్టిన స్టీల్ ప్లాంటు పనులు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. ఇక గనుల అప్‌గ్రెడేషన్ కోసం రూ.10,000 కోట్ల దాకా వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు.
 
విస్తరణపై దృష్టి: నైవేలీ లిగ్నైట్ సీఎండీ సురేంద్ర
12వ ప్రణాళిక కాలంలో (2012-2017) విస్తరణపై రూ. 29,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని సెమినార్‌లో నైవేలీ లిగ్నైట్ సీఎండీ సురేంద్ర మోహన్ తెలిపారు. ఇందులో 30 శాతం సొంత నిధులు కాగా, మిగతాది రుణం రూపంలో సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు.
 
ట్యుటికోరిన్‌లో తలపెట్టిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్లాంటు త్వరలో అందుబాటులోకి రాగలదని వివరించారు. బొగ్గు బ్లాకుల కొనుగోలు కోసం మొజాంబిక్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కొన్నింటిని షార్ట్‌లిస్ట్ చేశామని, 2014-15 ఆఖరుకల్లా డీల్ పూర్తి కాగలదన్నారు. లిగ్నైట్‌లో తేమ శాతాన్ని తగ్గించి, నాణ్యతను పెంచే దిశగా అప్‌గ్రెడేషన్ కోసం జపాన్‌కి చెందిన కోబే స్టీల్‌తో త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు