రెండో రోజూ నష్టాలే...

31 May, 2018 02:04 IST|Sakshi

ప్రతికూలముగా  అంతర్జాతీయ సంకేతాలు  

కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు ఉపసంహరణ 

43 పాయింట్లు పతనమై  34,906కు సెన్సెక్స్‌ 

10,614కు నిఫ్టీ  

అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ పడిపోయింది.  ఇటలీలో రాజకీయ అనిశ్చితి, అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింతగా పెరగడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి.  విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటంతో ఆద్యంతం లాభ, నష్టాల మధ్య కదలాడిన మన స్టాక్‌ సూచీలు చివరకు నష్టపోయాయి. స్టాక్‌ సూచీలు వరుసగా రెండో రోజూ క్షీణించాయి. భారత వృద్ధి అంచనాలను మూడీస్‌ సంస్థ తగ్గించడం, మే సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరొక్క రోజులో ముగియనుండటంతో అమ్మకాలు కొనసాగాయని నిపుణులు పేర్కొన్నారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 43 పాయింట్లు పతనమై 34,906 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 10,614  పాయింట్ల వద్ద ముగిశాయి.  

పతనానికి ప్రధాన కారణాలు... 
చైనాకు చెందిన 5,000 కోట్ల డాలర్ల వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ అనూహ్యంగా 25 శాతం సుంకాలను విధించారు. చైనాను కట్టడి చేయడానికి మేధోపరమైన హక్కుల నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఈ చర్యల కారణంగా ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. ఇటలీలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి.. ఆ దేశం యూరో నుంచి నిష్క్రమించే స్థాయికి దారితీయవచ్చన్న అంచనాలు ప్రతికూల ప్రభావం చూపించాయి.  ఈ ఏడాది భారత జీడీపీ అంచనాలను మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సంస్థ తగ్గించింది. గతంలో 7.5 శాతంగా ఉన్న జీడీపీ అంచనాలను తాజాగా 7.3 శాతానికి తగ్గించింది. భారత ఆర్థిక వ్యవస్థ చక్రీయ రికవరీ బాటలో ఉందని, అయితే, పెరుగుతున్న ముడి చమురు ధరలు, కఠినమవుతున్న ఆర్థిక పరిస్థితులు వృద్ధి జోరుకు కళ్లెం వేస్తాయని మూడీస్‌ పేర్కొంది. 

ఆల్‌టైమ్‌ హైకి మహీంద్రా.. 
ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌పై పలు బ్రోకరేజ్‌ సంస్థలు కొనచ్చు రేటింగ్‌ను ఇస్తూ, టార్గెట్‌ ధరలను పెంచాయి. దీంతో ఈ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.901 ను తాకింది. స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయినా ఈ షేర్‌ 3 శాతం లాభంతో రూ.896 వద్ద ముగిసింది. ఈ షేర్‌తో పాటు డీ–మార్ట్‌ రిటైల్‌ స్టోర్స్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్ట్స్, బెర్జర్‌ పెయింట్స్, బయోకాన్, డాబర్‌ ఇండియా, ఎడీల్‌వేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, పిడిలైట్‌ ఇండస్ట్రీస్, రాడికో ఖైతాన్, టాటా ఎలెక్సీ, వరుణ్‌ బేవరేజేస్‌ షేర్లు కూడా ఆల్‌ టైమ్‌ హైలను తాకాయి.   

మరిన్ని వార్తలు