ఈక్విటీల్లో ర్యాలీ కొనసాగుతుంది:క్రిస్ ‌వుడ్‌

27 Jun, 2020 13:17 IST|Sakshi

కోవిడ్‌-19 వ్యాధి రెండో దశ ఆందోళనలు ముందస్తు భయాలే

సైక్లికల్స్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

కోవిడ్‌-19 రెండోదశ వ్యాధి వ్యాప్తి ఆందోళనలు కేవలం ముందస్తు భయాలేనని, రానున్న రోజుల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగవచ్చని జెఫ్పారీస్‌ బ్రోకరేజ్‌ సం‍స్థ గ్లోబల్‌ హెడ్‌ఆఫ్‌ఈక్విటీ స్ట్రాటజీ క్రిస్టోఫర్‌ వుడ్‌ అభిప్రాయపడ్డారు.

‘‘మార్కెట్లు కరోనా కేసుల రెండో దశ వ్యాప్తి ఆందోళనల కంటే...  ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభంపైనే అధిక దృష్టిని సారించాయని స్పష్టమైంది. మొదటిసారి లాక్‌డౌన్‌లో భాగంగా ఇన్వెస్టర్లు సైక్లికల్స్‌, గ్రోత్‌ షేర్లకు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఇప్పడు రెండోదశ కోవిడ్‌ కేసులు పెరగడంతో సైక్లికల్స్‌ షేర్ల కొనుగోళ్లను తగ్గించి వృద్ధి షేర్లను అధికంగా కొంటారు. అయితే వచ్చే త్రైమాసికంలో సెం‍ట్రల్‌ బ్యాంకుల ద్రవ్యపాలసీ సరళంగా ఉండటం గ్రహించి మార్కెట్లు వీ-ఆకారపు రికవరీని అంచనా వేస్తూ తిరిగి సైక్లికల్‌ షేర్లను కొంటారు.’’ అని వుడ్‌ తన వీక్లీ నోట్‌ గ్రీడ్‌ అండ్‌ ఫియర్‌లో తెలిపారు. 


ఈక్విటీ ఇన్వెస్టర్లు వృద్ధి, వ్యాల్యూయేషన్‌ స్టాక్‌లను సొంతం చేసుకునేందుకు ‘‘బార్‌బెల్ వ్యూహాన్ని’’ అమలుపరచాలని వుడ్ సలహానిచ్చారు.  

కోవిడ్‌-19 రెండోదశ వ్యాప్తి భయాలు తెరపైకి రావడంతో గ్రోత్‌ స్టాక్‌లు ఆలస్యంగా ర్యాలీని ప్రారంభించాయి. అయితే మార్కెట్‌ వీ-ఆకారపు రికవరీ సెంటిమెంట్‌ బలపడటంతో ఫైనాన్షియల్‌, అటో, ఇంధన, మెటీరియల్‌(సైక్లికల్స్‌ స్టాక్స్‌) మరోసారి ర్యాలీ చేయవచ్చు అని తెలిపారు.

అమెరికా, ఐరోపా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా వైరస్ రెండో దశ లాక్‌డౌన్‌  ఉండకపోవచ్చని వుడ్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉండటంతో ట్రంప్ నేతృత్వంలో ప్రభుత్వం మళ్లీ ఆర్థికవ్యవస్థను మూసివేయడానికి మొగ్గుచూపకపోవచ్చన్నారు. రాబోయే త్రైమాసికంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మార్కెట్లను ప్రభావితం చేయటం ప్రారంభిస్తుందని వుడ్ చెప్పారు.

మరిన్ని వార్తలు