మిస్త్రీ కేసులో టాటాలకు మరో ఊరట 

25 Jan, 2020 05:34 IST|Sakshi

ఆర్‌వోసీ పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వుకు సుప్రీం స్టే  

న్యూఢిల్లీ: టాటా–మిస్త్రీ కేసులో టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఎస్‌పీఎల్‌)కు సుప్రీంకోర్టులో మరో ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే... టీఎస్‌పీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలంటూ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) డిసెంబర్‌ 18న ఉత్తర్వులిచ్చింది. టాటా సన్స్‌ను పబ్లిక్‌ కంపెనీ నుంచి ప్రైవేటు కంపెనీగా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ–ముంబై)  మార్చడం ‘‘అక్రమం’’ అని తన రూలింగ్‌లో పేర్కొంది.  ‘‘ఆర్‌ఓసీ సహాయంతో’’ అనే పదాన్నీ ఇక్కడ వినియోగించింది.

అయితే రూలింగ్‌లో ఈ పదాలను తొలగించాలని కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో బాధ్యతలు నిర్వహించే ఆర్‌వోసీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో ఒక సవరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ జనవరి 6న తిరస్కరించింది. దీనిపై ఆర్‌వోసీ సుప్రీంను ఆశ్రయించింది. టాటా సన్స్‌ను పబ్లిక్‌ కంపెనీ నుంచి ప్రైవేట్‌ కంపెనీగా మార్చడంలో తాము చట్టవిరుద్ధంగా వ్యవహరించామంటూ ఎన్‌సీఎల్‌ఏటీ వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కంపెనీల చట్టంలోని నిబంధనలకు అనుగుణంగానే తాము వ్యవహరించామని పేర్కొంది. ఇందుకు సంబంధించిన అంశంపై  సుప్రీంకోర్టు తాజాగా స్టే మంజూరుచేసింది.

మరిన్ని వార్తలు