అవాంఛిత కాల్స్‌  నియంత్రణకు వ్యవస్థ 

25 Feb, 2019 01:18 IST|Sakshi

న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా వ్యాపారపరమైన అవాంఛిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్‌ మొదలైన వాటిని నియంత్రించేందుకు చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ–కామర్స్‌ విధానంపై రూపొందించిన 41 పేజీల ముసాయిదాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బాధిత ఆన్‌లైన్‌ వినియోగదారుల ఫిర్యాదులను ఎలక్ట్రానిక్‌ పద్ధతిలోనే పరిష్కరించి, పరిహారం చెల్లించే అంశం కూడా ఇందులో ఉంది.

ఇందుకోసం ఈ–కన్జూమర్‌ కోర్టులను ఏర్పాటు చేసే ప్రతిపాదన సైతం ఈ ముసాయిదాలో పొందుపర్చారు. ఇక ఈ–కామర్స్‌ మార్కెట్‌ప్లేస్‌లో కార్యకలాపాలు నిర్వహించే వెబ్‌సైట్లు, యాప్స్‌ అన్నీ తప్పనిసరిగా దేశీయంగా వ్యాపార సంస్థగా రిజిస్టర్‌ అయి ఉండాలి. కొరియర్స్‌ ద్వారా భారత్‌కు వస్తువులను పంపే క్రమంలో కస్టమ్స్‌ నిబంధనలను ఉల్లంఘించే చైనా వెబ్‌సైట్లకు కళ్లెం వేసే క్రమంలో తాత్కాలికంగా అటువంటి పార్సిల్స్‌పై నిషేధం విధించాలని ముసాయిదా ప్రతిపాదించింది. అయితే, ప్రాణావసర ఔషధాలకు మాత్రం మినహాయింపునివ్వచ్చని పేర్కొంది. 

మరిన్ని వార్తలు