World Mental Health Day: మానసిక అనారోగ్యమే అని లైట్‌ తీసుకోవద్దు! బీ కేర్‌ ఫుల్‌! లేదంటే..

10 Oct, 2023 11:20 IST|Sakshi

మానసికంగా బాగుంటేనే మనం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు లెక్క. మెంటల్‌గా బాగుంటేనే మన రోజూవారీ లైఫ్‌కి ఎలాంటి ఢోకా ఉండదు. అలాంటి మనసే స్ట్రగులైతే సమస్యలన్నీ చుట్టుముట్టేస్తాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిన్ను నిలువునా పతనం దిశగా తీసుకువెళ్లి మట్టుబెట్టేంత వరకు వదలదు ఆ మానసిక వ్యాధి. దీన్ని జోక్‌గా తీసుకోవద్దు. ప్రతిమనిషి మానసికంగా బలంగా ఉంటే దేన్నేనా అవలీలగా జయించగలడు అన్నది సత్యం. అక్టోబర్‌ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక అనారోగ్యం ఎందుకొస్తుంది? ఎలా బయటపడాలి? తదితరాల గురించే ఈ కథనం.!

మానసిక అనారోగ్యామే అని కొట్టి పారేయొద్దు. అది ఓ భయానకమైన వ్యాధి మనిషిని నిలువునా కుంగదీసి చనిపోయేలా ప్రేరేపిస్తుంది. ముందుగానే మేల్కొని బయటపడేందుకు ప్రయత్నించకపోతే పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ మానసికంగా బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజూకి అనూహ్యంగా పెరుగుతుంది. అరచేతిలో ప్రపంచాన్ని చూపించేంత టెక్నాలజీ మన వద్ద ఉంది. టెక్నాలజీ పరంగా ఆర్థిక పరంగా మనిషి అభివృద్ధి శరవేగంగా దూసుకు వెళ్తోంది. అయినా మానసిక రుగ్మత బారిన పడి మనిషి ఎందుకు విలవిల్లాడుతున్నాడు. ఒక్కసారిగా పాతాళానికి పడిపోయి ఏం చేయలేను అనేంత స్థాయికి దిగజారి నిరాశ నిస్ప్రుహలోకి వెళ్లిపోతున్నాడు. ఎక్కడ ఉంది ఈ లోపం. వ్యవస్థలోనా? మనిషిలోనా ?అంటే..

మనిషి టెక్నాలజీ, అభివృద్ధి పేరుతో పెడుతున్న పరుగులు తనకు తెలియకుండానే మనసుపై ఒత్తిడిని పెంచేస్తున్నాయి. ఎదుటి వాడు తనకన్న బెటర్‌గా ఉన్నాడనే అక్కసు, తాను ఎక్కువ సంపాదించలేకపోతున్నాను అన్న నిరాశ, తాను అనుకున్నవి సాధించలేకపోయాను అన్న నిట్టూర్పుతో.. ఢీలా పడి ఈ మానసిక రుగ్మత బారిన ఈజీగా పడి పోతున్నాడు. ఆ తర్వాత దీన్నుంచి బయటపడలేక గుంజుకుపోతున్నాడు. చివరికి తనను తాను అంతం చేసుకునేంత స్థితికి దిగజారిపోతున్నాడు.  

ఎలా బయటపడాలి..?
ముందుకు కెరీర్‌ పరంగా లేదా ఆర్థిక పరంగానో,కుటుంబ పరంగానో మీరు ఉన్నతంగా లేదా మంచి స్థాయిలో లేకపోయామనే నిరాశ ఉంటే..దాన్ని వెంటనే మనసులోంచి తీసేయండి. అందరూ అన్ని సాధించలేకపోవచ్చు. కానీ ఎవరి ప్రత్యేకత వారిదే అది గుర్తించుకోండి. మొక్కలన్నింటి పువ్వులు ఉండవు. పుష్పించిన పూలన్నీ సుగంధాలు వెదజల్లవు. కానీ వాటికి ఉండే ప్రత్యేకత విభిన్నం, పోల్చదగినది కాదు. ఔనా!. సుగంధ భరితం కానీ పువ్వు ఔషధం అవుతుంది. సుగంధం వెద్దజల్లే పువ్వు అత్తరుగా మారతుంది. 

అలాగే మనుషులు కూడా అంతే. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా మనం కోల్పోయినవి, సాధించలేనివి తలుచుకుని.. వాటితో నిన్ను నువ్వు తక్కువ చేసుకుని ఆత్యనూన్యతకు గురై బాధపడటం మానేయండి. మొదట మీరు సాధించిన చిన్న చిన్న విజయాలు గుర్తు తెచ్చుకోండి. రికార్డు స్థాయి విజయాలు కాకపోయినా పర్వాలేదు. మీదైనా చిన్ని ప్రపంచంలో మీరు సాధించింది ఎంత చిన్నవైనా అవి గొప్పవే. మీలా మీ స్థాయిలో ఉన్నవాళ్లు ఎవ్వరూ సాధించలేకపోయారు లేదా చేరుకోలేకపోయారు. కనీసం మీరు ప్రయత్నించారు, కొంత అయినా సాధించారు అని మనస్సు పూర్తిగా ఫీలవ్వండి, సంతోషపడండి. పరాజయం పెద్దదైన చిన్నదైనా ఐ డోంటే కేర్‌ అనే పదం స్మరించండి. అది అన్నింటికీ అసలైన మందు. ఏ రోజుకైన ఎప్పటికైనా మీకంటూ ఓ రోజు వస్తుంది. మీరు సాధించగలుగుతారు అనేది సత్యం అని చాలా బలంగా మిమ్మల్ని మీరు విశ్వసించండి. ఇలా అనుకుంటే ఎలాంటి మానసిక వ్యాధైనా పరారే. 

వియోగం వల్ల వచ్చే మానసిక బాధ..
మనకు నచ్చిన వ్యక్తి లేదా ఆత్మీయుడు మన సొంతం అనే వ్యక్తి కాలవశాత్తు లేదా ప్రమాదవశాత్తు దూరం అయినా మానసికంగ కుంగిపోవద్దు. ఇది సర్వసాధారణం. అందరి జీవితాల్లో జరిగేదే. కొందరికి చిన్నతనంలోనే నా అనేవాళ్లు దూరం అయితే మరికొందరికీ ఓ స్టేజ్‌లో దూరం అవ్వచ్చు దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి ముందుకు సాగిపోండి. అదే ప్రేమికులు/భార్యభర్తలు విడిపోయినా లేదా చనిపోయినా మీ బాధ వర్ణనాతీతం. ఎవ్వరూ తీర్చలేనిది తట్టుకోలేనిది ఒప్పుకుంటాం.

కొందరూ మన జీవిత ప్రయాణంలో కొంత వరకే. వారి జ్ఞాపకాలు మన వెంట పదిలంగా ఉంటాయి. గుండె నిండా శ్వాస పీల్చుకుని వారిని గుర్తు చేసుకోండి అలానే ఎందుకు దూరం అయ్యారని బాధపడొద్దు. మీకు తీరని ద్రోహం చేసి నిలువునా మోసం చేసి వెళ్లిపోయారని అస్సలు చింతించొద్దు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇదొక గుణపాఠంగా తీసుకో. నీ స్థాయికి సరిపోని వాడు అని గడ్డిపరకను తీసిపడేసినట్టు పడేయి. నీ మనసు పట్టి పీడుస్తున్న వేదన దూదిపింజలా తేలిక అయిపోతుంది. మనిషి ఎంతో తెలివైన వాడు. అసాధ్యలన్నింటిని సాధించగలుగుతాడు. తనలాంటి సాటి మనుషుల చేతిలో మోసపోయిన, ధగ పడితే మాత్రం తిరిగి లేచి నిలబడలేక విలవిలలాడతాడు. ఎందుకిలా? 'ఓ మనిషి' నీకు మహాశక్తి ఉంది. మెలి పెడుతున్న మనుసును మధించి సరైన మార్గంలో పెట్టి దూసుకుపోవాలి.

గమ్మతైన మనసు కథ..
మనల్ని ఎంతో ప్రేమించి మనమే సర్వస్వం అనుకునే వాళ్లని ప్రతి క్షణం స్మరించం. కానీ మనల్ని బాధపెట్టిన వాడిన మన మనసు పదే పదే గుర్తు తెచ్చుకుని ఏడుస్తుంది. నీలో నీవే తిట్టుకుంటూ, భోంచేసినా, కూర్చొన్నా, అతడినే గుర్తు తెచ్చుకుంటావు. మనకు ఇష్టం లేకపోతే మనకు నచ్చిన స్వీట్‌ అయినా పక్కన పెడతాం. అలాంటిది మనకు నచ్చని వ్యక్తి, వేదన పాలు చేసిన వాళ్లను, వాళ్ల తాలుకా గాయాలను ఎందుకు తలుచుకుంటున్నాను అని ఎప్పుడైనా ఆలోచించారా?. కనీసం ఛీ! వీడు నన్ను ఇంతలా బాధపెట్టాడు గుర్తు తెచ్చుకోవడమే పాపం అని గట్టిగా మీరు అనుకున్నట్లయితే. ఏ మానసిక సమస్య మీ దరిదాపుల్లోకి రాగలదు.

జీవితం సాఫీగా సాగితే నీ గొప్పదనం ఉండదు. ఆటుపోట్లు ఉంటేనా మంచి కిక్కు ఉంటుంది. అదే నీ గొప్పతనన్ని బయటపెట్టుకునే ఓ గొప్ప అవకాశం. దురదృష్టవంతుడివి కాబట్టి కష్టాలు రాలేదు. నువ్వు తట్టుకోగల సమర్థుడువి కాబట్టే నీకు వచ్చాయి. అవే రాకపోతే నీ సామర్థ్యం ఏంటో నీకు తెలియదు. పైగా నువ్వు గొప్పోడివి అని చూపించుకునే అవకాశం ఉండదు. మిత్రమా! సాధించలేకపోవడంలోనే సాధన ఉంది. కోల్పోవడంలోనే పొందడం ఉంది. ఇదే నిజం! కూల్‌గా ఆలోచించి.. మనో చిత్తాన్ని పట్టిపీడించే చింతను చిత్తుచేసి మానసికంగా ధృఢం ఉండేలా మనసుకి శిక్షణ ఇవ్వండి. సులభంగా మానసిక అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారు.

(చదవండి: స్టెరాయిడ్స్‌ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్‌ ఖాన్‌ సైతం..)

మరిన్ని వార్తలు