బీమాలో ‘టర్మ్’ ఉండాల్సిందే

12 Oct, 2014 01:35 IST|Sakshi
బీమాలో ‘టర్మ్’ ఉండాల్సిందే

ఆధునిక కాలంలో చిన్న కుటుంబాల సంఖ్య వేగంగా విస్తరిస్తోంది. అలాగే యువత ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్‌లో మార్పులు కనపడుతున్నాయి. పెళ్లి చేసుకున్న వెంటనే సొంతంగా జీవితం ప్రారంభించడమే కాకుండా అత్యుత్తమమైన జీవన విధానాన్ని కోరుకుంటున్నారు. ఇంటి భద్రత, కుటుంబ సభ్యుల కోసం అనేక చర్యలు తీసుకునే వీరు వారి ఆర్థిక రక్షణ విషయానికి వచ్చే సరికి మాత్రం  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
 
ప్రతీ ఒక్కరికి అనేక ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, రిటైర్మెంట్‌లతో పాటు మరికొంత మంది తల్లిదండ్రుల బాగోగులను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్ష్య సాధన కోసం సంపాదన మొదలు పెట్టినప్పటి నుంచే పొదుపు ప్రణాళికలను మొదలు పెడతారు.

కానీ ఇంటిలో సంపాదిస్తున్న వ్యక్తికి ఊహించడానికే వీలులేని సంఘటన జరిగితే.. ఈ ఆర్థిక లక్ష్యాలు, సేవింగ్స్ సంగతి ఏంటి? ఇవన్నీ ఆగిపోవాల్సిందేనా? ఈ ప్రశ్నలకు టర్మ్ ఇన్సూరెన్స్ చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. కుటుంబ పెద్ద లేకపోయినా అతని లక్ష్యాలు ఆగిపోకుండా, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టర్మ్ ఇన్సూరెన్స్ భరోసాను అందిస్తుంది.
 
జీవిత బీమాలో ప్రతీ ఒక్కరు కలిగి ఉండాల్సిన పాలసీల్లో టర్మ్ పాలసీ ఒకటి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించడమే కాకుండా, ఇతర పాలసీలతో పోల్చుకుంటే తీసుకునే విధానం కూడా సులభం. పాలసీ కాలపరిమితి మధ్యలో పాలసీదారునికి ఏదైనా జరిగితే ముందుగా నిర్దేశించిన బీమా మొత్తాన్ని నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కేవలం క్లెయిమ్‌లు తప్ప మెచ్యూర్టీలు ఉండకపోవడంతో ప్రీమియంలు తక్కువగా ఉంటాయి.

వయస్సు పెరిగే కొద్ది ప్రీమియం పెరుగుతుంది కాబట్టి చిన్న వయస్సులోనే దీర్ఘకాలానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ కాలం ప్రయోజనం పొందొచ్చు. 60 ఏళ్లు దాటిన వారికి ప్రీమియంలు అధికంగా ఉంటాయి కాబట్టి వారికి టర్మ్ ఇన్సూరెన్స్ సూచించలేము. జీవితంలో ఆర్థిక బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ టర్మ్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని కూడా పెంచుకుంటూ ఉండండి.

ఎంతుండాలి?
బీమా మొత్తం ఎంచుకునేటప్పుడు రెండు అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్థిక లక్ష్యాలకు కావల్సిన మొత్తంతో పాటు గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు ఏమైనా ఉంటే ఆ మొత్తానికి సరిపడా బీమాను తీసుకోవాలి. సాధారణంగా 20 నుంచి 40 ఏళ్ల లోపు వాళ్లు వార్షిక జీతానికి 20 నుంచి 30 రెట్లు అధిక మొత్తానికి కనీస బీమా రక్షణ కలిగి ఉండాలి. అదే 40-50 ఏళ్ల లోపు వారికి 10 నుంచి 20 రెట్లు, 50 ఏళ్లు దాటిన వారు 5 నుంచి 10 రెట్లు బీమా కలిగి ఉంటే సరిపోతుంది.

మరిన్ని వార్తలు