జూడాల సమ్మె యథాతథం | Sakshi
Sakshi News home page

జూడాల సమ్మె యథాతథం

Published Sun, Oct 12 2014 1:33 AM

జూడాల సమ్మె యథాతథం

డిప్యూటీ సీఎంతో కొలిక్కిరాని చర్చలు.. రేపు మరోసారి భేటీ
 

హైదరాబాద్: వారం రోజులుగా సమ్మెలో ఉన్న జూనియర్ డాక్టర్లతో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాలనే నిబంధన తొలగింపు మినహా.. ఇతర డిమాండ్లన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించినా జూడాలు పట్టువీడలేదు. దీంతో సోమవారం మరోసారి చర్చలు జరుపుతామని ఇటు ప్రభుత్వం, అటు జూడాలు ప్రకటించారు. అప్పటివరకు సమ్మె యథాతంగా కొనసాగిస్తామని, సోమవారం జరిగే చర్చల ఫలితం ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తేల్చిచెప్పారు. శనివారం సచివాలయంలో రాజయ్యతో చర్చల అనంతరం జూనియర్ డాక్టర్ల సంఘం జేఏసీ చైర్‌పర్సన్ కృష్ణచైతన్య, ప్రధాన కార్యదర్శి నాగార్జున విలేకరులతో మాటాడారు. తాము గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు సిద్ధంగానే ఉన్నామని, అయితే ఏడాదిపాటు కాంట్రాక్టు పద్ధతిన కాకుండా రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగం ఇచ్చి పంపితే పనిచేస్తామన్నారు.

ఎవరి ప్రోద్బలంతోనో..

జూనియర్ డాక్టర్లు అడిగిన వాటికంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మేలే చేస్తోందని.. ఆ విషయం వారికీ స్పష్టంగా తెలుసునని డిప్యూటీ సీఎం రాజయ్య పేర్కొన్నారు. జూడాల భాష, మాట తీరు చూస్తే ఎవరి ప్రోద్బలంతోనో వారు సమ్మె చేస్తున్నారని అనిపిస్తోందన్నారు. చర్చల అనంతరం డిప్యూటీ సీఎం ‘సాక్షి’తో మాట్లాడారు. పీజీ వైద్య విద్యా అర్హత కోసం ఏడాది పా టు గ్రామీణ ప్రాంత ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందించాలనే నిబంధన మినహా ఇతర అన్ని డిమాండ్లు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ నిబంధనపై ఇప్పటికే జూడాలు హై కోర్టులో వేసిన కేసు పెండింగ్‌లో ఉందన్నారు.  

రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తాం..

జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉన్నా... ఆసుపత్రుల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని ఉప ముఖ్యమంత్రి రాజయ్య చెప్పారు. ప్రత్యేక బలగాలను నియమించి రూ.7 , 8 కోట్ల వ్యయాన్ని భరించైనా సరే జూడాలకు భద్రత కల్పించనున్నామన్నారు.
 
నిజామాబాద్‌లో 79 డెంగీ కేసులు


తెలంగాణలో అంటువ్యాధులు, విష జ్వరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని రాజయ్య తెలిపారు. మూడ్రోజులుగా జిల్లాల వారీగా సమీక్షలు చేపడుతున్నామన్నారు.  
 

Advertisement
Advertisement