టెస్లా జోరు- ఇక ఎస్‌అండ్‌పీలో చోటు!

23 Jul, 2020 11:59 IST|Sakshi

క్యూ2లో 10.4 కోట్ల డాలర్ల నికర లాభం

వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలు

ఏడాది కాలంలో షేరు 500 శాతం ర్యాలీ

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీ

టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో నాలుగో ప్లాంటుకి శ్రీకారం

110 కోట్ల డాలర్ల పెట్టుబడి- 5,000 మందికి ఉపాధి

టెక్నాలజీ ఆధారిత ఎలక్ట్రిక్‌ కార్ల అమెరికన్‌ దిగ్గజం టెస్లా ఇంక్‌.. ఇటు ఆర్థిక ఫలితాలు, ఆటు షేరు ర్యాలీలోనూ జోరు చూపుతోంది. ఈ ఏడాది(2020) రెండో త్రైమాసికంలో 10.4 కోట్ల డాలర్ల(రూ. 780 కోట్లు) నికర లాభం ఆర్జించింది. తద్వారా వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను సాధించింది. దీంతో ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌లో చోటు సాధించేందుకు అర్హత సాధించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. క్యూ2(ఏప్రిల్‌-జూన్‌)లో టెస్లా మొత్తం ఆదాయం 6.04 బిలియన్‌ డాలర్లను తాకింది. కాగా.. బుధవారం 1.5 శాతం బలపడి 1592 డాలర్ల  వద్ద ముగిసిన షేరు ఫ్యూచర్స్‌లో మరో 4.5 శాతం ఎగసింది. ఇప్పటికే కంపెనీ మార్కెట్‌ విలువ 295 బిలియన్‌ డాలర్లను దాటడంతో ఆటో దిగ్గజం టయోటాను వెనక్కి నెట్టింది. వెరసి మార్కెట్‌ విలువ రీత్యా ఆటో రంగంలో అత్యంత విలువైన కంపెనీగా టెస్లా నిలుస్తోంది. టెస్లా షేరు 12 నెలల్లో 500 శాతం ర్యాలీ చేయగా.. 2020లో ఇప్పటివరకూ 200 శాతంపైగా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే!

కారణాలున్నాయ్
కోవిడ్‌-19 అనిశ్చితులలోనూ క్యూ2లో టెస్లా ఇంక్‌ అంచనాలను అధిగమిస్తూ 90,650 వాహనాలను విక్రయించగలిగింది.  మోడల్‌ 3, మోడల్‌ Y కార్లకు ఏర్పడిన డిమాండ్‌ ఇందుకు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఈ రెండు మోడళ్ల కార్లను రూపొందించేందుకు తాజాగా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో 110 కోట్ల డాలర్ల(రూ. 8250 కోట్లు) అసెంబ్లింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ తాజాగా ప్రకటించారు. తద్వారా 5,000 మందివరకూ ఉపాధి లభించనున్నట్లు తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే మూడు ప్లాంట్లను కలిగి ఉంది. ఇటీవల యూఎస్‌లో భారీ ఆసక్తి నెలకొన్న కంపెనీ తయారీ మోడల్‌ 3 కారు ప్రారంభ ధర 38,000 డాలర్లు(రూ. 28.5 లక్షలు) అంటూ విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు.

తొలుత దైమ్లర్‌తో జత
134 ఏళ్ల క్రితమే ఆధునిక కార్ల తయారీని ప్రారంభించిన జర్మన్‌ దిగ్గజం.. దైమ్లర్‌ 2009 మే నెలలో టెస్లా ఇంక్‌లో 10 శాతం వాటాను సొంతం చేసుకుంది. తద్వారా టెక్నాలజీ ఆధారిత కార్ల తయారీపై దృష్టితో ప్రారంభమైన స్టార్టప్‌.. టెస్లా ఇంక్‌కు 5 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. అయితే తదుపరి కాలంలో టెస్లా తయారీ టెక్నాలజీ ఆధారిత కార్లను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడంపై దైమ్లర్‌ సందేహించినట్లు తెలుస్తోంది. దీంతో  2014 డిసెంబర్‌లో టెస్లాలో గల 10 శాతం వాటాను  దైమ్లర్‌ విక్రయించింది. అయితే దైమ్లర్‌తో జట్టుకట్టడం ద్వారా టెస్లా..  కార్ల దీర్ఘకాలిక భద్రత, నియంత్రణ తదితర అంశాలను అవగాహన చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది తదుపరి దశలో కంపెనీకి ఉపయుక్తంగా నిలిచినట్లు అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు