భారత్‌లోకి ప్రవేశించనున్న టెస్లా!

7 Nov, 2023 13:59 IST|Sakshi

అధిక దిగుమతి సుంకంతో భారత్‌లో ప్రవేశించని టెస్లా

అనుమతులు క్రమబద్ధీకరించే యోచనలో కేంద్రం

ఈవీ తయారీదారులను ప్రోత్సహించే దిశగా నిర్ణయం

ఎలాన్‌మస్క్‌కు చెందిన టెస్లా కార్ల గురించి వినడం..సామాజిక మాధ్యమాల్లో చూడడం తప్పా నేరుగా భారత్‌లో ఉపయోగించింది లేదు. ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల టెస్లా కార్లకు అనుమతులు ఇవ్వలేదు. అయితే ఈసారి 2024 జనవరి నాటికి అవసరమైన అన్ని అనుమతులను క్రమబద్ధీకరించాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన సమావేశంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. టెస్లాతో సహా ఇతర పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులిచ్చేలా చర్చలు జరిగాయని ఒక ఉన్నత అధికారి చెప్పినట్లు తెలిసింది.

జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ సమావేశమయ్యారు. అప్పటినుంచి కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, భారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలు టెస్లాను భారత్‌కు తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారతదేశంలో కార్లు, బ్యాటరీల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. 2024 జనవరిలో అనుమతులు లభిస్తే టెస్లా కార్లను వీలైనంత త్వరలో భారత్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తుంది.

దిగుమతి సుంకం తగ్గింపు చర్చల్లో పురోగతి లేకపోవడంతో టెస్లా గతంలో భారత్‌లో ప్రవేశించలేదు. దాదాపు రూ.33లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 60% వరకే దిగుమతి సుంకం విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. పూర్తిగా అసెంబుల్డ్ ఎలక్ట్రిక్ కార్లపై 40% ట్యాక్స్‌ ఉండేలా అభ్యర్థించింది. టెస్లా వాహనాలను ఎలక్ట్రిక్ కార్లుగా కాకుండా లగ్జరీ కార్లుగా గుర్తించాలని తెలిపింది. భారత్‌లో స్థానిక తయారీ యూనిట్‌ను స్థాపించడానికి ముందే తమ కార్ల విక్రయాన్ని ప్రారంభించాలని భావించింది. అయితే దిగుమతి సుంకం రాయితీల కోసం స్థానిక తయారీకి కట్టుబడి ఉండాలని ప్రభుత్వం చెప్పింది. కస్టమ్స్ డ్యూటీ రాయితీల స్థానంలో తయారీదారులకు ప్రత్యక్ష రాయితీలను అందిస్తూ, ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని టెస్లాకు వివరించింది.

ఇదీ చదవండి: త్వరలో మొబైల్ యూజర్లకు ప్రత్యేక కస్టమర్ ఐడీ

భారత కస్టమ్స్ డ్యూటీ నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ కార్లు, హైడ్రోకార్బన్ ఆధారిత వాహనాలను సమానంగా పరిగణిస్తారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి భారీగా సుంకాలను విధిస్తున్నారు. అయితే ఈవీ తయారు చేసే కంపెనీలను ప్రోత్సహించేలా పర్యావరణ అనుకూల వాహనాలపై తక్కువ పన్ను విధించేలా కొత్త దిగుమతి పాలసీని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ వెసులుబాటు టెస్లాకు మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే ఏ కంపెనీకైనా వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు