టైటాన్‌ లాభం రూ.348 కోట్లు 

9 May, 2019 00:01 IST|Sakshi

ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌ కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 14 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.304 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.348 కోట్లకు పెరిగిందని టైటాన్‌ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,126 కోట్ల నుంచి రూ.4,945 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ భాస్కర్‌ భట్‌ తెలిపారు. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారాయన. నికర అమ్మకాలు రూ.3,917 కోట్ల నుంచి 19 శాతం ఎగసి రూ.4,672 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం రూ.475 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.511 కోట్లకు పెరిగింది. 9.8 శాతం మార్జిన్‌ సాధించామని భట్‌ పేర్కొన్నారు.  

రూ.19,961 కోట్లకు మొత్తం ఆదాయం... 
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.1,102 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,389 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.16,245 కోట్ల నుంచి రూ.19,961 కోట్లకు చేరుకుంది. గత కొన్నేళ్లుగా ఉన్నట్లే వృద్ధి జోరు గత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగిందని భాస్కర్‌ భట్‌ వివరించారు.  కీలకమైన వ్యాపార  విభాగాల్లో ఆదాయం, లాభం అంశాల్లో పటిష్టమైన వృద్ధిని సాధించామన్నారు. అత్తరు బ్రాండ్‌ స్కిన్, భారత దుస్తులకు సంబంధించిన బ్రాండ్‌ తనైరాలను భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న సంవత్సరాల్లో మంచి వృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టైటాన్‌ కంపెనీ షేర్‌ 0.2 శాతం లాభంతో రూ.1,088 వద్ద ముగిసింది. ఫలితాలు మార్కెట్‌ ముగిశాక వెలువడ్డాయి. 

మరిన్ని వార్తలు