టైటన్‌ లాభం అప్‌

4 Nov, 2023 06:30 IST|Sakshi

క్యూ2లో రూ. 916 కోట్లు

న్యూఢిల్లీ: జ్యువెలరీ, వాచీల తయారీ దిగ్గజం టైటన్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 916 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 835 కోట్లు ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 25 శాతం జంప్‌చేసి రూ. 10,708 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 8,567 కోట్ల అమ్మకాలు సాధించింది. అయితే మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 11,402 కోట్లకు చేరాయి.

ఇక మొత్తం కన్సాలిడేటెడ్‌ ఆదాయం 37 శాతం ఎగసి రూ. 12,653 కోట్లయ్యింది. దీనిలో జ్యువెలరీ విభాగం ఆదాయం 39 శాతం జంప్‌చేసి రూ. 11,081 కోట్లను తాకగా.. వాచీలు తదితర బిజినెస్‌ 32 శాతం  వృద్ధితో రూ. 1,092 కోట్లకు చేరింది. వెరసి వాచీలు, వేరబుల్స్‌ విభాగం తొలిసారి రూ. 1,000 కోట్ల టర్నోవర్‌ను అందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఐకేర్‌ ఆదాయం 13 శాతం బలపడి రూ. 189 కోట్లయ్యింది. ఈ కాలంలో కొత్తగా 10 టైటన్‌ వరల్డ్‌ స్టోర్లతోపాటు, హీలియోస్‌ 5, ఫాస్ట్‌ట్రాక్‌ 5 చొప్పున స్టోర్లను ఏర్పాటు చేసింది.  

ఫలితాల నేపథ్యంలో టైటన్‌ షేరు బీఎస్‌ఈలో 2.3 శాతం బలపడి రూ. 3,273 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు