పొగాకు ఎగుమతులతో 6 వేల కోట్ల ఆదాయం

21 May, 2014 03:15 IST|Sakshi
పొగాకు ఎగుమతులతో 6 వేల కోట్ల ఆదాయం

 పొగాకు బోర్డు చైర్మన్ కె.గోపాల్
 
 గుంటూరు, న్యూస్‌లైన్ : పొగాకు ఎగుమతుల ద్వారా 2013-14 సంవత్సరంలో 6,059.31 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లు పొగాకుబోర్డు చైర్మన్ కె.గోపాల్ చెప్పారు. గుంటూరులోని బోర్డు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఎగుమతుల ద్వారా ఐదువేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లు తెలిపారు.  ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో పొగాకు ఉత్పత్తులకు లక్ష్యాలను నిర్దేశించామని, ప్రతి సంవత్సరం 270నుంచి 280 మిలియన్ కేజీల పొగాకును ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు.
 
 లక్షమంది రైతులు ఈ ప్రక్రియలో భాగస్వాములు అయ్యారని, 2.25 లక్షల ెహ క్టార్లలో వర్జీనియా పొగాకు ఉత్పత్తి చేశామన్నారు. వర్జీనియా పొగాకును సిగిరెట్ పొగాకు అని, ప్రీమియం వెరైటీ అని పిలుస్తారని చెప్పారు. ఉత్పత్తి చేసిన వర్జీనియా పొగాకులో 75శాతం ఎగుమతి చేశామని వెల్లడించారు.  బోర్డు ఎగుమతి చేసిన పొగాకును 107దేశాల్లో 137  కంపెనీలు  దిగుమతి చేసుకున్నాయని, పశ్చిమయూరప్‌కు 34శాతం, తూర్పు యూరప్‌కు 14శాతం, మధ్యప్రాచ్య దేశాలకు 11శాతం, ఆగ్నేయాసియాకు 20శాతం, ఆఫ్రికాకు 13శాతం, దక్షిణ అమెరికాకు 8శాతం, ఆస్ట్రేలియాకు ఒకశాతం ఎగుమతి చేసినట్లు వెల్లడించారు. మనదేశం నుంచి ఎగుమతి అయ్యే పొగాకు నాణ్యతతోపాటు శుభ్రంగా ఉండాలని ఇంటర్నేషనల్‌మార్కెట్ ఎదురు చూస్తోందని, రైతులనుంచి క్వాలిటీ ఉన్న పొగాకు వచ్చేలా పొగాకు బోర్డు చర్యలు తీసుకుందనీ చెప్పారు.
 
తద్వారా మంచిరేటు వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో180 మిలియన్ కేజీలు ఉత్పత్తి అయ్యిందని, 19 వేలం కేంద్రాల ద్వారా 65 రోజుల్లో 75 మిలియన్ కేజీల పొగాకు మార్కెట్ అయ్యిందని చెప్పారు. .జూలై నెలాఖరునాటికి మిగిలిన పొగాకు అమ్మకాలు జరిగేలా చూస్తామని, వేలం కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ సిస్టం అన్ని చోట్లా ఉండటం వల్ల అమ్మకాలు త్వరగా జరుగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కిలో పొగాకుకు 171 రూపాయల ధర వచ్చిందని, హైగ్రేడ్ పొగాకు ఉత్పత్తి ఈ ఏడాది బాగా పెరిగి, లో గ్రేడ్ రేషియో తగ్గిందన్నారు. లో అండ్ మినిమమ్ గ్రేడ్‌కు కూడా డిమాండ్ బాగానే ఉన్నట్లు గోపాల్ చెప్పారు. 

మరిన్ని వార్తలు