ఈ–కామర్స్‌లో పారదర్శకతకు పెద్దపీట 

22 Dec, 2018 01:08 IST|Sakshi

కొత్త విధానంపై కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ వ్యాపారంలో పారదర్శకతను పెంపొందించే దిశగా కొత్త ఈ–కామర్స్‌ విధానం ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్‌ ప్రభు వెల్లడించారు. ధరలు, డిస్కౌంట్లలో పారదర్శకతతో పాటు ఇటు రిటైలర్లు అటు కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కొత్త విధానం ముసాయిదాపై కసరత్తు చేస్తోందని, వచ్చే 2–3 వారాల్లో సంబంధిత వర్గాల అభిప్రాయాల కోసం దీన్ని వెల్లడిస్తామని ప్రభు తెలిపారు. ‘ఈ–కామర్స్‌ వ్యాపార నిర్వహణను సులభతరం చేయడమనేది పాలసీ ప్రధాన లక్ష్యం. ఇటు రిటైలర్లకు... అటు వినియోగదారులకు ఇది ప్రయోజనకరంగా ఉండాలి.

ఈ–కామర్స్‌ వ్యాపారంలో ధరలు, డిస్కౌంట్ల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలి‘ అని ఆయన చెప్పారు. ‘డిస్కౌంట్లు ఇవ్వొచ్చని గానీ ఇవ్వొద్దని గానీ మేం నిర్దేశించబోము. ఏది చేసినా పారదర్శకంగా ఉండాలన్నదే మా ఉద్దేశం‘ అని మంత్రి వివరించారు. వాణిజ్య శాఖ గతంలో తయారు చేసిన ముసాయిదాలోని సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని కొత్త ముసాయిదాను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు, భారత్‌లో తయారీ కేంద్ర ఏర్పాటు విషయంలో కొన్ని మినహాయింపులు కోరుతున్న అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌ ప్రతినిధులతో వచ్చే నెల దావోస్‌లో భేటీ కానున్నట్లు సురేశ్‌ ప్రభు తెలిపారు. ఇప్పటికే యాపిల్‌తో చర్చలు జరుగుతున్నాయని, ఆ సంస్థ కోరుతున్న మినహాయింపులను ప్రభుత్వం పరిశీలించే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. 

మరిన్ని వార్తలు