పామాయిల్‌ విక్రయాల్లోకి ట్రైమెక్స్‌

6 Apr, 2017 00:45 IST|Sakshi
పామాయిల్‌ విక్రయాల్లోకి ట్రైమెక్స్‌

భారత్‌లో ఫెల్డా బ్రాండ్‌తో రిటైల్‌లోకి
దేశవ్యాప్తంగా రిఫైనరీల ఏర్పాటు
రూ.1,000 కోట్ల దాకా పెట్టుబడి
ట్రైమెక్స్‌ ఈడీ ప్రశాంత్‌ కోనేరు


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఖనిజాలు, లోహాల వ్యాపారంలో ఉన్న ట్రైమెక్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా పామాయిల్‌ విపణిలోకి ప్రవేశించింది. ముడి పామాయిల్‌ ఉత్పత్తిలో ప్రపంచ దిగ్గజమైన మలేషియా సంస్థ ఫెల్డా గ్లోబల్‌ వెంచర్స్‌ హోల్డింగ్‌ బెర్హడ్‌తో కంపెనీ చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం కింద ఫెల్డా ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ట్రైమెక్స్‌ విక్రయిస్తుంది. దేశీయంగా తయారైన ఫెల్డా బ్రాండ్‌ పామాయిల్‌ ఉత్పత్తులను 2017 చివరినాటికి ప్రవేశపెడతామని ట్రైమెక్స్‌ ఈడీ ప్రశాంత్‌ కోనేరు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు కంపెనీ తొలి ప్రాధాన్యతగా చెప్పారు. సామాన్యుల కోసం ప్రత్యేకంగా 250 గ్రాముల సైజులో సైతం ప్యాక్‌లను తీసుకొస్తామని వెల్లడించారు. 2021 నాటికి టాప్‌ బ్రాండ్లలో ఒకటిగా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రపంచ పామాయిల్‌ వినియోగంలో 12 శాతం వాటాతో భారత్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఫెల్డా గ్లోబల్‌ ఇప్పటికే ఏటా 6 లక్షల టన్నుల పామాయిల్‌ ఉత్పత్తులను భారత్‌లోని పలు కంపెనీలకు సరఫరా చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ రిఫైనరీ..
మలేషియాలోని ఫెల్డా ప్లాంట్ల నుంచి ముడి పామాయిల్‌ను దిగుమతి చేసుకుని భారత్‌లో శుద్ధి, ప్యాకింగ్‌ చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న రిఫైనరీల కొనుగోలు లేదా కొత్తవి ఏర్పాటు చేస్తామని ప్రశాంత్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లతోపాటు దేశవ్యాప్తంగా రెండేళ్లలో 8–10 రిఫైనరీలు అందుబాటులోకి రానున్నాయి. 2.5 లక్షల లీటర్ల వార్షిక సామర్థ్యంతో ప్రారంభించి 15 లక్షల లీటర్ల స్థాయికి తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. రిఫైనరీల ఏర్పాటు, మార్కెటింగ్‌కుగాను వచ్చే మూడేళ్లలో రూ.1,000 కోట్ల దాకా ఇరు సంస్థలు పెట్టుబడి పెడతాయని చెప్పారు. రిటైల్‌ ధర ఇతర కంపెనీలకు పోటీనిచ్చేదిగా ఉంటుందని అన్నారు. మలేషియాలో పామాయిల్‌ గెలలను చెట్టు నుంచి వేరు చేసిన 24 గంటల్లోపే ముడి నూనెగా మార్చగలిగే వ్యవస్థ ఫెల్డాకు ఉందని వివరించారు. భారత్‌లో పామాయిల్‌ సాగు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కాగా, భారత్‌కు దిగుమతి అవుతున్న ముడి వంట నూనెల్లో పామాయిల్‌ వాటా అత్యధికంగా 54 శాతముంది.

>
మరిన్ని వార్తలు