టాటాడొకోమోతో ట్రూకాలర్ ఒప్పందం

25 Apr, 2014 01:15 IST|Sakshi
టాటాడొకోమోతో ట్రూకాలర్ ఒప్పందం

న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన మొబైల్ కాలర్ ఐడీ సేవల సంస్థ ట్రూకాలర్.. టాటా డొకోమోతో ఒప్పందం కుదురుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. దేశంలో ఒక టెలికం కంపెనీతో ట్రూకాలర్ జట్టుకట్టడం ఇదే తొలిసారి. కాగా, ఈ ఒప్పందం ప్రకారం టాటా డొకోమో ఖాతాదారులు మొబైల్ ఇంటర్నెట్‌కోసం ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే ట్రూకాలర్ సర్వీసులను పొందేందుకు వీలవుతుంది. ట్రూకాలర్ అప్లికేషన్(యాప్).. యూజర్ల అనుమతితో వాళ్ల ఫోన్‌బుక్‌లోని నంబర్లను తమ డేటాబేస్‌లో చేర్చుకుంటుంది.

ఎవరైనా మరో ట్రూకాలర్ యూజర్ ఫోన్‌కాల్‌ను అందుకున్నప్పుడు అవతలివాళ్ల నంబర్ తమ ఫోన్‌లో నిక్షిప్తమైలేనప్పటికీ... వాళ్ల పేరును స్క్రీన్‌పై చూపించడం ఈ ట్రూకాలర్ ప్రత్యేకత. ‘భారత్ మార్కెట్ మాకు చాలా కీలకమైనది. మొత్తం 5.5 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లలో ఇక్కడినుంచే 3 కోట్ల మంది ఉన్నారు. టాటా డొకోమోతో ఒప్పందానికి ఉన్న ప్రాముఖ్యతేంటో ఈ గణాంకాలే చెబుతాయి’ అని ట్రూకాలర్ వైస్ ప్రెసిడెంట్(గ్రోత్ అండ్ పార్ట్‌నర్‌షిప్-ఆసియా) కరి కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎవరైనా తెలియని వ్యక్తులు తమ నంబర్లను సెర్చ్ చేయకుండా చేయడం కోసం యూజర్లు నంబర్లను ట్రూకాలర్ వెబ్‌సైట్ నుంచి తొలగించుకునే(అన్‌లిస్ట్) అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, సాధారణ సేవలతో పాటు ప్రీమియం సేవలను కూడా టాటా డొకోమో కస్టమర్లు 90 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చని కృష్ణమూర్తి ఈ సందర్భంగా వివరించారు.

మరిన్ని వార్తలు