ఉబెర్‌కు భారీ నష్టాలు

9 Aug, 2019 15:52 IST|Sakshi

క్యాబ్‌ సేవల సంస్థ ఉబెర్‌కు ఈ క్వార్టర్‌లో భారీ షాక్‌ తగిలింది. 2017లో పరిమిత ఆర్థిక డేటాను వెల్లడించడం ప్రారంభించిన అనంతరం  ఉబెర్ టెక్నాలజీస్ ఇంక్ అతిపెద్ద త్రైమాసిక రికార్డు నష్టాన్ని చవిచూసింది. ఉబర్ సేల్స్ భారీగా క్షీణించడంతో 5.2 బిలియన్ డాలర్లు (రూ.520 కోట్లు) నష్టపోయినట్టు ఉబర్ ఇంక్ ఒక ప్రకటనలో నివేదించింది.  ఆదాయం 14శాతం పెరిగి 3.17 బిలియన్లుగా ఉంది.  అయితే ఎనలిస్టులు ఊహించిన దాని కంటే ఎక్కువ నష్టాలను ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఐపీవో సందర్భంగా స్టాక్ ఆధారిత కంపెన్సేషన్‌ కారణంగా ఇంత భారీ నష్టం వాటిల్లిందని వాల్‌స్ట్రీట్‌ అనలిస్టులు అంచనా. ఈ ఫలితాల నేపథ్యంలో ఉబెర్‌ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి.

ఈ త్రైమాసికంలో ఉబెర్ ఖర్చులు 147శాతం పెరిగి 8.65 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రధాన ప్రత్యర్థి లిఫ్ట్‌తో పోటీ నేపథ్యంలో పరిశోధన, అభివృద్ధిపై వెచ్చించిన ఖర్చు గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల ట్రిప్ 20 శాతం పెరగగా, ఉబెర్ తన డ్రైవర్లకు చెల్లించిన తర్వాత ఉంచిన మొత్తం కేవలం 4 శాతం మాత్రమే పెరిగింది. కంపెనీలు చారిత్రాత్మకంగా రైడర్‌లను ఆకర్షించడానికి సబ్సిడీపై ఆధారపడ్డాయి. స్థూల బుకింగ్‌లు15.76 బిలియన్లు (సంవత్సరానికి 37శాతం  పెరిగింది)గా ఉన్నాయి. ఫుడ్ డెలివరీ ఉబెర్ ఈట్స్ ఆదాయం 72 శాతం పెరిగి 595 మిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఉబెర్‌ ప్రత్యర్థి లిఫ్ట్‌ బుధవారం ప్రకటించిన ఫలితాల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఆదాయ గణాంకాలను నమోదు చేసింది.

ప్రధానంగా రైడింగ్‌ సేవల వ్యాపారంలో వృద్ధి మందగించడంతో తీవ్ర నష్టాలను చవి చూసింది. దీంతో ఉబర్ వాటాలను 6 శాతం వరకు తగ్గించింది. ఆదాయ వృద్ధి మందగించడం ఉబెర్ పోటీని విస్తరించి నిరోధించే సామర్థ్యాన్ని కోల్పోవడం నష్టాలకు దారితీసినట్టు ఆర్థిక మార్కెట్ విశ్లేషకుడు హరిస్ అన్వర్ తెలిపారు.

అయితే పెట్టుబడుల దూకుడు కొనసాగిస్తామనీ, అది కూడా ఆరోగ్యకరమైన వృద్ధిగా ఉండాలని  కోరకుంటున్నామని ఉబెర్‌ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. అంతేకాదు  ఈ త్రైమాసికంలో  ఆ దిశగా మంచి పురోగతి సాధించామని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెల్సన్ చాయ్ అన్నారు. 2020, 2021 సంవత్సరాల్లో  పెట్టుబడులు గరిష్టంగా ఉండనున్నాయని, దీంతో నష్టాలు తగ్గుతాయని భావిస్తున్నామని ఉబెర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, దారా ఖోస్రోషాహి  చెప్పారు.

>
మరిన్ని వార్తలు