తెలుగు రాష్ట్రాల్లో ఉడిపి రుచి..

29 Dec, 2016 01:52 IST|Sakshi
తెలుగు రాష్ట్రాల్లో ఉడిపి రుచి..

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రెడీ టు ఈట్‌ ఉత్పత్తుల విపణిలో ఉన్న ఉడిపి రుచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రవేశించింది. బ్రేక్‌ఫాస్ట్, రైస్, మీల్‌ మిక్సెస్, స్పైస్‌ మిక్సెస్, హెల్త్‌ డ్రింక్స్‌ వంటి 100కుపైగా ఉత్పత్తులను కంపెనీ తయారు చేస్తోంది. ఇప్పటి దాకా కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లో అమ్మకాలు సాగించామని ఉడిపి రుచి బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్న శ్రీ ఫ్యామిలీ గ్రూప్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఆర్‌.రావు సాహిబ్‌ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశంలో తొలిసారిగా అత్యాధునిక డ్రై బ్లెండ్‌ టెక్నాలజీతో బెంగళూరులో తయారీ కేంద్రం నెలకొల్పినట్టు చెప్పారు. రసాయనాలు కలపకుండా ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు తెలిపారు. పరిశోధన, అభివృద్ధికి రూ.20 కోట్ల వ్యయం చేశామన్నారు. క్లబ్‌ మహీంద్రా, ఓబెరాయ్, లావజ్జా, స్పార్‌ సూపర్‌ మార్కెట్లకు ప్రొడక్టులను సరఫరా చేస్తున్నామన్నారు.

రెడీ టు ఈట్‌ ఉత్పత్తులతో..
శ్రీ ఫ్యామిలీ గ్రూప్‌ బెంగళూరు, కోయంబత్తూరు, అహ్మదాబాద్‌లో కెఫే ఉడిపి రుచి రెస్టారెంట్లను విజయవంతంగా నిర్వహిస్తోంది. వీటిలో రెడీ టు ఈట్‌ ఉత్పత్తులతోనే ఆహార పదార్థాలను అందిస్తారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో కొద్ది రోజుల్లో ఈ ఔట్‌లెట్‌ రానుంది. దేశవ్యాప్తంగా మూడేళ్లలో ఫ్రాంచైజీ విధానంలో 300 కెఫేలను నెలకొల్పుతామని రావు సాహిబ్‌ వెల్లడించారు. ‘50 కేంద్రాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తాం. కియోస్క్, రెస్టారెంట్, హైవే మోడల్స్‌లో ఇవి రానున్నాయి. మోడల్‌నుబట్టి రూ.12 లక్షల నుంచి రూ.1.2 కోట్ల వరకు పెట్టుబడి అవసరం. ఫుడ్‌ తయారీ నిపుణులను నియమిస్తాం’ అని వివరించారు. గ్రూప్‌లో తొలి కంపెనీ నూతచ్‌ న్యూట్రికేర్‌ టెక్నాలజీస్‌ను లలిత రావు సాహిబ్‌ 1999లో రూ.30 వేల పెట్టుబడితో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌ రూ.70 కోట్ల టర్నోవరు, 180 మంది సిబ్బందితో విస్తరిస్తోంది.

మరిన్ని వార్తలు