యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్!

2 Sep, 2015 00:59 IST|Sakshi
యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్!

- సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
యునినార్ కస్టమర్లకు కొద్దిరోజుల్లో హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి రాబోతోంది. అది కూడా మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరలోనే. ఇందుకు నెట్‌వర్క్‌ను పూర్తిగా నూతన టెక్నాలజీతో ఆధునీకరిస్తున్నామని, తమ ప్రమోటర్ సంస్థ టెలినార్ గ్రూప్ చైనా టెక్నాలజీ దిగ్గజం హువావె టెక్నాలజీస్‌తో చేతులు కలిపిందని యునినార్ వెల్లడించింది.

ఈ డీల్ విలువ రూ.1,300 కోట్లకు పైమాటే. యునినార్ సేవలందిస్తున్న ఆరు సర్కిల్స్‌లో 2017 చివరినాటికి 24,000 సైట్స్‌లో టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేస్తామని, సాఫ్ట్‌వేర్‌ను జోడించడం ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ ఆఫర్ చేసేందుకు ఈ టెక్నాలజీతో వీలవుతుందని యునినార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ తెలియజేశారు. మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... మార్కెట్ డిమాండ్ ను బట్టి ఎంతైనా స్పీడ్‌ను అందిస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబరుకల్లా 5,000 సైట్స్ ఆధునీకరణ పూర్తి అవుతుంది.
 
సబ్‌సే సస్తా కొనసాగిస్తాం..
‘‘దేశవ్యాప్తంగా యునినార్ చందాదారుల సంఖ ్య 4.8 కోట్లుంది. ఇందులో 24 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఈ కస్టమర్లు ప్రతినెల 3-4 శాతం పెరుగుతున్నారు. 1 జీబీ డేటాను రూ.100 లోపే అందిస్తున్నాం. కొత్త టెక్నాలజీతో వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి’’ అని ఎక్స్‌టర్నల్ కమ్యూనికేషన్స్ హెడ్ అనురాగ్ ప్రసాద్ తెలిపారు.  2017 నాటికి ఇంటర్నెట్ చందాదారుల సంఖ్యను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. కాగా  కంపెనీ కాల్ సెంటర్‌కు కాల్ డ్రాప్స్ ఫిర్యాదులు లేవని శ్రీనాథ్ తెలిపారు.

మరిన్ని వార్తలు