వొడాఫోన్ ఐడియాకు ఏజీఆర్‌,రేటింగ్‌  షాక్‌

31 Oct, 2019 11:27 IST|Sakshi

52 వారాల కనిష్టానికి వొడాఫోన్ ఐడియా షేర్లు 

సాక్షి, ముంబై: సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) పై  ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుపై సుప్రీంకోర్టు  ఇచ్చిన తీర్పు టెల్కోలను  భారీగా ప్రభావితం చేస్తోంది. మరోవైపు రేటింగ్‌ సంస్థల రేటింగ్‌లు ఆయా సంస్థల షేర్లను నష్టాల్లోకి నెడుతున్నాయి. తాజాగా  కేర్‌ సంస్థ వొడాఫోన్‌ ఐడియాకు డౌన్‌ గ్రేడింగ్‌  రేటింగ్‌ ఇన్వెస్టర్ల  సెంటిమెంట్‌ను మరింత బలహీనపర్చింది. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో వొడాఫోన్‌ ఐడియా షేర్లు 9 శాతానికిపైగా కుప్పకూలాయి. బీఎస్‌ఈలో రూ.3.48 వద్ద 52 వారాల కనిష్టాన్ని నమోదు  చేసింది. ఎన్‌ఎస్‌ఇలో 9.2 శాతం క్షీణించి రూ .3.45కు చేరుకుంది. అటు భారతి ఎయిర్‌టెల్‌ షేర్‌ కూడా స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది.

కేజీ రేటింగ్స్ దీర్ఘకాలిక బ్యాంక్ సౌకర్యాలు,  నాన్‌-కన్వర్టిబుల్  డిబెంచర్లపై రేటింగ్‌ను తగ్గించిందని వోడాఫోన్ ఐడియా బుధవారం తెలిపింది. టెలికాం విభాగం (డాట్‌) ప్రారంభ లెక్కల ప్రకారం, వోడాఫోన్ ఐడియా సుమారు రూ .40వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా, భారతి ఎయిర్‌టెల్ సుమారు రూ. 42 వేల  కోట్ల  (లైసెన్స్ ఫీజు , స్పెక్ట్రం వినియోగ ఛార్జీలతో సహా)ను  కేంద్రానికి చెల్లించాల్సి వుంది. 

కాగా గురువారం దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ సెన్సెక్స్‌ కొత్త రికార్డు సృష్టించింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 280 పాయింట్లు లాభపడి 40312 పాయింట్ల స్థాయిని అధిగమించి ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరింది.

మరిన్ని వార్తలు