డిఫాల్టర్లపై ఏ చర్యలు తీసుకున్నారు?   

30 Aug, 2018 01:23 IST|Sakshi

సమాధానం చెప్పాలని ఆర్థిక శాఖ, ఆర్‌బీఐలకు సీఐసీ ఆదేశాలు

న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రూ. 50 కోట్ల పైబడి రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారిపై (డిఫాల్టర్లు) ఏమేం చర్యలు తీసుకున్నారో బహిర్గతం చేయాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్‌ బ్యాంక్, గణాంకాలు.. పథకాల అమలు శాఖను కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) ఆదేశించింది. ఒకవేళ అలా చేయని పక్షంలో డిఫాల్టర్ల పేర్లు బయటపెట్టాలని ఎందుకు ఆదేశించకూడదో సెప్టెంబర్‌ 20లోగా తగిన వివరణనివ్వాలని సూచించింది. ఒకవైపు స్వల్ప రుణాలను కట్టలేని పరిస్థితుల్లో ఉన్న చిన్న రైతులను బహిరంగంగా పరువు తీస్తూ.. మరోవైపు కోట్ల రూపాయలు ఎగవేసిన డిఫాల్టర్లకు మాత్రం కావాల్సినంత సహకారం అందించడం జరుగుతోందని సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు విమర్శించారు. సమాచార హక్కు చట్టం సెక్షన్‌ 4 (1) (సీ) ప్రకారం ప్రజలపై ప్రభావం చూపే కీలక నిర్ణయాలు, విధానాలన్నింటి గురించి ప్రభుత్వ విభాగాలన్నీ సమగ్రమైన వివరాలను ప్రచురించాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రూ. 50 కోట్ల పైబడిన రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన డిఫాల్టర్లపై ఏమేం చర్యలు తీసుకున్నారు, ప్రజాధనాన్ని.. ఎకానమీని కాపాడటానికి తీసుకుంటున్న చర్య లేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కేంద్ర ఆర్థిక శాఖ, గణాంకాల శాఖ, ఆర్‌బీఐకి ఉంటుందని ఆచార్యులు చెప్పారు.  

కార్పొరేట్లకో రూలు.. రైతులకో రూలా? 
రుణాలు చెల్లించలేక పరువు పోగొట్టుకున్నామన్న అవమానభారంతో 1998 నుంచి 2018 దాకా దేశవ్యాప్తంగా 30,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆచార్యులు పేర్కొన్నారు. మరోవైపు, రూ. 50 కోట్ల పైబడి రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన డిఫాల్టర్లకు వన్‌టైమ్‌ సెటిల్మెంట్లు, వడ్డీ మాఫీ వంటి మినహాయింపులతో పాటు పలు ప్రయోజనాలు కల్పిస్తున్నారని, వారి ప్రతిష్ట దెబ్బతినకుండా ఎక్కడా పేర్లను కూడా బైటికి రానివ్వడం లేదని ఘాటుగా విమర్శించారు. 

మరిన్ని వార్తలు