వచ్చే వారమే వాట్సాప్‌ చెల్లింపు సేవలు షురూ..

29 May, 2018 19:08 IST|Sakshi

వాషింగ్టన్‌ : వచ్చే వారం నుంచే భారత్‌లో వాట్సాప్‌ పేమెంట్‌ సేవలను ప్రారంభించేందుకు ఫేస్‌బుక్‌ సన్నాహాలు చేస్తోంది. భాగస్వామ్య సంస్థలు ఇంకా సన్నద్ధం కాకపోయినా మార్కెట్‌ వాటాను పెంచుకునేందుకే హడావిడిగా చెల్లింపు సేవలను చేపడుతున్నారని భావిస్తున్నారు. చెల్లింపు సేవల కోసం వాట్సాప్‌ ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లతో ఒప్పందం చేసుకుంది. త్వరలోనే ఎస్‌బీఐ కూడా వాట్సాప్‌ చెల్లింపులను అనుమతిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ప్రత్యర్థుల దూకుడుకు బ్రేక్‌ వేసేందుకు మూడు బ్యాంకులతో ఒప్పందాలతోనే ముందుకెళ్లాలని, వీలైనంత త్వరగా వాట్సాప్‌ పేమెంట్‌ సేవలను ప్రారంభించాలని ఫేస్‌బుక్‌ భావిస్తోంది. వాట్సాప్‌ పే పైలట్‌ వెర్షన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో పది లక్షల మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకురాగా మెరుగైన స్పందన లభించిందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

వాట్సాప్‌ పేమెంట్స్‌ సేవలు తమకు తీవ్ర పోటీ ఇస్తాయని గూగుల్‌ తేజ్‌, అలీబాబా పేటీఎం భావిస్తున్నాయి. వాట్సాప్‌ మెసేజింగ్‌ సేవలను భారత్‌లో 20 కోట్ల మంది ఉపయోగిస్తున్న క్రమంలో వాట్సాప్‌ పేమెంట్‌ సేవలు విజయవంతమవుతాయని సంస్థ అంచనా వేస్తోంది. 

మరిన్ని వార్తలు