వాట్సాప్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ వారికి వచ్చేసింది..

8 Feb, 2018 14:08 IST|Sakshi
వాట్సాప్‌ పేమెంట్స్‌ ఫీచర్‌

మెసేజింగ్‌ యాప్‌లో బాగా పాపులర్‌ అయిన వాట్సాప్‌, యూపీఐ ఆధారిత పేమెంట్స్‌ ఫీచర్‌తో మరింత మంది భారత కస్టమర్లను ఆకట్టుకోవాలనుకుంటోంది. ఈ మేరకు భారత్‌లో పేమెంట్స్‌ ఫీచర్‌ను కూడా వాట్సాప్‌ టెస్ట్‌ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ ఎంపిక చేసిన ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో యూపీఐ ఆధారితంగా.. నగదును వేరే వాళ్లకి పంపించడం, వేరే వాళ్ల ద్వారా నగదును యూజర్లు పొందడం వంటివి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఐఓఎస్‌లోని 2.18.21 వాట్సాప్‌ వెర్షన్‌కు, ఆండ్రాయిడ్‌ 2.18.41 వెర్షన్‌ వారికి అందుబాటులో ఉన్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇటీవల భారత్‌లో డిజిటల్‌ పేమెంట్లు ఎక్కువగా పెరగడంతో, పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆఫర్‌చేసి మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని వాట్సాప్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

గిజ్మో టైమ్స్‌లో ఈ వాట్సాప్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ తొలుత స్పాట్‌ అయింది. చాట్‌ విండోలోనే ఈ ఫీచర్‌ను యూజర్లు యాక్సస్‌ చేసుకోవచ్చు. గేలరీ, వీడియో, డాక్యుమెంట్లు వంటి ఇతర ఆప్షన్లతో పాటు ఈ ఆప్షన్‌ కూడా ఇక అందుబాటులో ఉంటుంది. పేమెంట్స్‌ను క్లిక్‌ చేస్తే.. ఓ డిస్క్లైమర్ విండో ఓపెన్‌ అవుతుంది. దీనిలో బ్యాంకుల జాబితా కూడా ఉంటుంది. యూపీఐతో కనెక్ట్‌ అయిన బ్యాంకు అకౌంట్‌ను యూజర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ను మీరు కనుక వాడి ఉండకపోతే, ప్రమాణీకరణ పిన్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. అదనంగా యూపీఐ యాప్‌ ద్వారా లేదా సంబంధిత బ్యాంకు వెబ్‌సైట్‌ ద్వారా యూపీఐ అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. లావాదేవీని విజయవంతంగా పూర్తిచేసుకోవాలంటే నగదు పంపేవారికి, స్వీకరించే వారికి ఇద్దరికీ కచ్చితంగా వాట్సాప్‌ ఆఫర్‌ చేసే పేమెంట్స్‌ ఫీచర్‌ ఉండాలి.  

మరిన్ని వార్తలు