ఫండ్స్‌లో ఏ ప్లాన్‌ ఎంచుకోవాలి?

6 Jan, 2020 06:02 IST|Sakshi

నాకు రెండేళ్ల కూతురు ఉంది. తనను మంచి చదువులు చదివించాలన్న ఆలోచనతో స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెట్టాను. ఇది సరైన నిర్ణయమేనా?  
 –అనిత, విశాఖపట్టణం  

మీరు మొదటిసారిగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లయితే ఇది సరైన నిర్ణయం కాదు. ఆరంభంలో స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. దీంతో మొదటిసారిగా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ఇన్వెస్టర్లు బెంబేలు పడతారు. ఫండ్సంటే భయపడేలా నష్టాలూ రావచ్చు. మీరు స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెట్టి కనీసం రెండేళ్లు అయితే, వాటి పనితీరుపై మీకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉండాలి. అందుకని వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించండి. మార్కెట్‌ పతన బాటలో ఉన్నా, ఈ సమయంలో వీటి పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నా, కొండొకచో నష్టాలు వచ్చినా అధైర్యపడకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి.  ఏదైనా హైబ్రిడ్‌ లేదా మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందవచ్చు. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మీరు డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందలేరు. అందుకని స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసే వాళ్లంతా సదా అప్రమత్తంగా ఉండాలి.

స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు ఇప్పడున్నట్లుగానే మరో రెండేళ్ల తర్వాతో, మూడేళ్ల తర్వాతో అలాగే ఉంటుందనుకోకూడదు. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు బాగా ఉంది కదాని చాలా మంది ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మొదలుపెడతారు. అప్పుడు ఈ ఫండ్‌లోకి ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వచ్చి చేరడం మొదలవుతుంది. అప్పుడు ఈ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ మేనేజర్‌కు ఈ నిధులను మేనేజ్‌ చేయడం కష్టమవుతుంది. ఆశించిన స్థాయిలో ఫండ్స్‌ పనితీరు ఉండకపోవచ్చు. మొత్తం మీద స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేసే ఇన్వెస్టర్లు రెండు ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది మార్కెట్‌  ఎలా ఉన్నా, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం. ఇక రెండవది కనీసం, ఆరు నెలల కొకసారైనా, మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్స్‌ పనితీరును జాగ్రత్తగా మదింపు చేయడం.  ఇక డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందడం కోసం మీ పోర్ట్‌ఫోలియోలో కనీసం ఒక్క మల్టీ క్యాప్‌ ఫండ్‌నైనా చేర్చుకోండి.  

నేను మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో నెలకు కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. అయితే వీటిల్లో మూడు రకాలైన ప్లాన్‌లు ఉంటాయని తెలిసింది. డివిడెండ్, డివిడెండ్‌ రీఇన్వెస్ట్‌మెంట్, గ్రోత్‌
ప్లాన్‌లు–ఈ మూడింటితో దేంట్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది?  

 –అన్వర్‌ పాషా, కరీంనగర్‌
ఈ మూడు ప్లాన్‌ల్లో గ్రోత్‌ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఒక ఇన్వెస్టర్‌కు డివిడెండ్, డివిడెండ్‌ రీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లు సరైనవి కావని చెప్పవచ్చు.  ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌పై డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ) విధించినప్పటి నుంచి చూస్తే, గ్రోత్‌ ప్లాన్‌లే మిగిలిన రెండు ప్లాన్‌ల కన్నా మెరుగైనవి అని చెప్పవచ్చు. డెట్‌ ఫండ్స్‌ విషయంలోనూ గ్రోత్‌ ప్లాన్‌లనే ఎంచుకోవడం మంచిది. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసి, కొంత కాలం తర్వాత సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌(ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. పైగా ఎస్‌డబ్ల్యూపీని పాటించడం వల్ల పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఇక ఈక్విటీ ఫండ్స్‌ విషయానికొస్తే, గ్రోత్‌ ప్లాన్‌ను ఎంచుకోవడం వల్ల, మీపై డీడీటీ భారం ఏమాత్రం పడదు.  

నా వయస్సు 42 సంవత్సరాలు. నాకు ఐదేళ్ల పాప ఉంది. తన ఉన్నత చదువుల నిమిత్తం రూ.60 లక్షలు అవసరమవుతాయని అంచనా. తనకు 18 ఏళ్ల వచ్చేటప్పటి నుంచి ఈ డబ్బులు అవసరం అవుతాయి. నా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లానింగ్‌ ఎలా ఉండాలి?    
–సుధీర్, హైదరాబాద్‌  

ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే, పిల్లల ఉన్నత చదువుల కోసం కనిష్టంగా రూ.20 లక్షలు, గరిష్టంగా రూ.20 కోట్లు అవసరమవుతాయని అంచనా. మీ పాప ఉన్నత చదువుల కోసం రూ.60 లక్షల మేర అవసరమవుతాయని మీరు అంచనా వేయడం సరైనదే. ఈ డబ్బులు పొందడానికి మీకు 13 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి మీరు మదుపు చేయడానికి ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఎంత వీలైతే అంత ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. గత 15–20 ఏళ్లలో చదువులకు సబంధించిన ఖర్చులు బాగా పెరిగాయి. రానున్న 10–15 ఏళ్లలో ఈ వ్యయాలు ఈ స్థాయిలో పెరగకపోయినా,  బాగానే పెరిగే అవకాశాలున్నాయి. ఈక్విటీ ఫండ్స్‌ వార్షిక రాబడులు గత కొంత కాలంగా 18–20 శాతం రేంజ్‌లో ఉన్నాయి. అయితే ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే 12 శాతం రాబడిని ఆశించడం సమంజసమేనని చెప్పవచ్చు. అందుకని ఈక్విటీ ఫండ్స్‌లో ఎంత వీలైతే అంత ఇన్వెస్ట్‌ చేస్తూ ఉండండి. మీకు మరో పదమూడేళ్ల తర్వాత ఈ సొమ్ములు అవసరం కాబట్టి, పదేళ్ల తర్వాత ఈక్విటీ ఫండ్స్‌ల్లో మదుపు చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత భాగాన్ని స్థిరాదాయ సాధనాల్లోకి బదిలీ చేయండి. ఇలా చేయడం వల్ల అప్పటి(మీరు మీ మదుపును విత్‌డ్రా చేసేకునే సమయం నాటి) మార్కెట్‌ స్థితిగతుల ప్రభావం మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పెద్దగా ఉండకపోవచ్చు.

ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

మరిన్ని వార్తలు