ఫలితాలపై ఆశలు... మార్కెట్లకు జోష్‌

14 Apr, 2018 00:17 IST|Sakshi

మూడోవారమూ లాభాల్లో  ముగిసిన సూచీలు

సెన్సెక్స్‌ 91.52 పాయింట్లు,  నిఫ్టీ 22 పాయింట్లు లాభం  

ముంబై: ఐఐపీ, ద్రవ్యోల్బణం గణాంకాలు మెరుగ్గా ఉండటంతో పాటు కార్పొరేట్ల ఆదాయాలపై ఆశావహ ధోరణులతో దేశీ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో వారమూ లాభాల్లో ముగిసింది. సెషన్‌ ఆఖర్లో కొంత ఒడిదుడుకులకు లోనైనప్పటికీ సూచీలు ఆరు వారాల గరిష్ట స్థాయిలో క్లోజయ్యాయి. మార్కెట్స్‌ వరుసగా ఏడు సెషన్స్‌ లాభాల్లో ముగియడం.. గతేడాది నవంబర్‌ తర్వాత ఇదే తొలిసారి. గురువారం ట్రేడింగ్‌ పూర్తయిన తర్వాత వెల్లడైన స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం, ఇన్ఫోసిస్‌ ఫలితాల ముందు ఆశావహ ధోరణితో పాటు అటు ఆసియాలోని ఇతర మార్కెట్స్‌ లాభాల్లో ఉండటం దేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు ఊతమిచ్చినట్లు బ్రోకింగ్‌ సంస్థలు పేర్కొన్నాయి. 

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 91 పాయింట్ల లాభంతో 34,193 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 10,481 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 34,313 –34,104 మధ్య కదలాడి చివరికి 34,193 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫిబ్రవరి 27 నాటి 34,346 పాయింట్ల తర్వాత ఇదే గరిష్ట స్థాయి ముగింపు. గడిచిన ఏడు సెషన్స్‌లో సూచీ ఏకంగా 1,174 పాయింట్లు పెరిగింది. అటు నిఫ్టీ కూడా 10,520–10,451 పాయింట్ల మధ్య తిరుగాడి చివరికి 0.21 శాతం లాభంతో 10,481 వద్ద క్లోజయ్యింది. దీంతో రెండు సూచీలు వరుసగా మూడోవారమూ లాభాల్లో ముగిసినట్లయింది. ఐటీ స్టాక్స్, ప్రైవేట్‌ బ్యాంకులు, మెటల్‌ షేర్స్‌ ర్యాలీ జరిపాయని, వరుసగా రెండు వారాల లాభాల తర్వాత అమ్మకాల ఒత్తిడితో పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ నష్టపోయినట్లు ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చాలా మటుకు ఆసియా మార్కెట్లు, యూరప్‌ మార్కెట్లు లాభాల్లోనే ట్రేడయ్యాయి.  

సెన్సెక్స్‌లో అదానీ టాప్‌..:సెన్సెక్స్‌ షేర్లలో అదానీ పోర్ట్స్‌ అత్యధికంగా 2.66 శాతం, విప్రో 2.28 శాతం లాభపడ్డాయి. ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు ఇన్ఫీ 0.58% పెరిగింది. ఎంబైబ్‌ సంస్థలో 73 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నామన్న ప్రకటనతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 1.22% పెరిగింది. సూచీల వారీగా చూస్తే మెటల్‌ ఇండెక్స్‌ 1%, హెల్త్‌కేర్‌ 0.56 శాతం, ఐటీ 0.50 శాతం, రియల్టీ 0.44% పెరిగాయి. క్యాపిటల్‌ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి.  

మరిన్ని వార్తలు