డీలర్ల డిలే..!

29 Jan, 2018 05:52 IST|Sakshi

రిటర్న్స్‌ ఫైల్‌ చేయడంలో నిర్లక్ష్యం

నోటీసులు ఇచ్చేందుకు అధికారుల సన్నాహాలు

ప్రతి వ్యాపారి తాము జరిపే లావాదేవీల వివరాలను(రిటన్స్‌) నిర్దేశిత గడువులోపు సమర్పించాల్సి ఉంటుంది. అయితే డివిజన్‌లో చాలా మంది వ్యాపారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రారంభంలో వ్యాపారులకు పూర్తిస్థాయిలో అవగాహన లేదనే ఉద్దేశంతో ప్రభుత్వపరంగా కొంత చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. అయితే జీఎస్టీ అమల్లోకి వచ్చి ఆరునెలలు గడిచిపోతుండటం, ఆర్థిక
సంవత్సరం ముగియడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పటి నుంచి వెంటపడకపోతే మార్చి నెలాఖరు నాటికి బకాయిలు పేరుకుపోయే అవకాశం ఉందనే ఆలోచన వాణిజ్య పన్నుల శాఖ అధికారుల్లో మొదలైంది. దీంతో సక్రమంగా రిటర్నులు సమర్పించని వారి లిస్టు తయారీ చేసి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

చిత్తూరు కార్పొరేషన్‌: జీఎస్టీ నిబంధనల ప్రకారం ఒక కోటి లోపు వార్షిక వ్యాపారం (టర్నోవర్‌) ఉన్నవారు కాంపోజిషన్‌ పథకం కిందికి వస్తారు. ఇతర రాష్ట్రాలకు సరుకులు రవాణా చేసేవారు, ఈ–కామర్స్‌ లావాదేవీలు నిర్వహించేవారు, రూ.2.5 లక్షల పనిచేసే కాం ట్రాక్టర్లు తదితరుల విషయంలో వార్షిక టర్నోవర్‌ ఎంతున్నా రెగ్యులర్‌ డీలర్‌గానే పరిగణనలోకి తీసుకుంటారు.

రిటర్నుల దాఖలులో మీనమేషాలు..
కాంపోజిషన్‌ పథకం కిందకు వచ్చే వ్యాపారులు మూడు నెలలకు బకసారి చొప్పున జీఎస్టీ–4 పేరుతో రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంది. రెగ్యులర్‌ డీలర్లు అయితే ప్రతినెలా జరిగిన వ్యాపార లావాదేవీలను పేర్కొంటూ మరుసటి నెల 21వ తేదీలోగా 3బీ పేరుతో రిటర్నులు నమోదు చేయాల్సి ఉంది. రెండు విభాగాల వ్యాపారులూ రిటర్నులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అయితే రెండు కేటగిరీలకు చెందిన వ్యాపారుల్లో అత్యధిక శాతం మంది నిర్దేశించిన గడువులోగా రిటర్నులు దాఖలు చేయకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. నవంబరు నెల వరకు జరిపిన లావాదేవీలను డిసెంబర్‌ 15లోగా సమర్పించాల్సి ఉన్నా, ఇంకా 25 శాతం వ్యాపారులు మీనవేషాలు లెక్కిస్తున్నారు.

జిల్లాలో మొత్తం 23,561 మంది డీలర్లు ఉన్నారు. ఇందులో జీఎస్టీ పరిధిలో 17,223 మంది, కాంపోజిషన్‌ పరిధిలో 6,388 మంది వస్తారు.  కొత్త చట్టం వచ్చి ఆరునెలలు గడిచినా వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో, సరిదిద్దాలని పన్నులశాఖ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. తొలిదశలో రెగ్యులర్‌ డీలర్ల విషయంలో ఒత్తిడి పెంచాలని తర్వాత కాంపోజిషన్‌ డీలర్ల విషయంలో ఒత్తిడి పెంచాలన్న ఆలోచనలో ఉన్నారు. కాంపోజిషన్‌ డీలర్ల పరంగా 6,388 మంది ఉండగా, అందులో ఎంత మంది ఐటీసీ తీసుకుంటున్నారనే విషయం అధికారుల వద్ద అందుబాటులో లేదు. జీఎస్టీ చట్టం ప్రకారం నిర్దేశించిన గడువులోగా రిటర్నులు సమర్పించని వ్యాపారులపై రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఒకేసారి జరిమానాలకు వెళ్లకుండా తొలుత నోటీసులు జారీచేసి, కొంత గడువు ఇచ్చిన తర్వాత జరిమానా విధించాలని అధికారులు భావిస్తున్నారు.

1 నుంచి ఈ వేబిల్లు అమలు..
ఫిబ్రవరి 1 నుంచి ఈ–వేబిల్లు అమలు అవుతుంది. ప్రసుత్తం ట్రయిల్‌ రన్‌లో ఉంది. సకాలంలో రిట్నర్నులు ఫైల్‌ చేయని డీలర్లకు నోటీసులు అందిస్తున్నాం. గడువు దాటిన తర్వాత ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా జరిమానా పడుతుంది. రిట్నర్నులు ఫైల్‌ చేయకపోతే జరిమానా విధిస్తాం.– ఓంకార్‌రెడ్డి, జేసీ, వాణిజ్యపన్నుల శాఖ.

మరిన్ని వార్తలు