ఉప్పొంగిన అభిమానం.. ఉప్పెనలా జనం | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన అభిమానం.. ఉప్పెనలా జనం

Published Mon, Jan 29 2018 5:45 AM

people support to ys jagan in praja sankalpa yatra - Sakshi

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం.. జనం.. ప్రభంజనం. ఊళ్లకు ఊళ్లే తరలొచ్చినట్టు.. కెరటం ఎగిసిపడ్డట్టు.. నేలే కన్పించనట్టు.. జనమే జనం. జనమెక్కడానికి చెట్లు చాల్లేదు. భవనాలూ సరిపోలేదు. గోడలు.. వాహనాలు.. ఏది కన్పిస్తే అది.. ఎక్కడ కాసింత చోటు కనిపిస్తే అక్కడా జనం. తోసుకొచ్చేవాళ్లు, ఎగిరెగిరి చూసేవాళ్లు.. వాళ్లను వాళ్లే మైమరచి జననేతను తదేకంగా చూస్తూ.. ఆయన మాటలను వింటున్న సన్నివేశాలు గూడూరు చరిత్రలో అరుదైన ఘట్టమంటున్నారు స్థానికులు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం గూడూరు కూడలిలో విపక్ష నేత వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ దగ్గర కన్పించిన సన్నివేశమిది. చిన్నారులు మొదలు.. వృద్ధుల వరకు అభిమాన నేతను చూసేందుకు భారీగా తరలివచ్చారు. జగన్‌ ప్రసంగించే సభా స్థలి జనంతో నిండిపోయింది. అందరికీ కన్పించేందుకు ఆయన తన చుట్టూ ఉన్న నేతలను వెనక్కు పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్‌ స్వరం జనం గొంతుకైంది. ప్రజల కష్టాలు.. ప్రభుత్వ అవినీతే జగన్‌ వాగ్బాణాలయ్యాయి. రోజూ అనుభవించే కష్టాలు.. అనుక్షణం కన్నీరు పెట్టించే అగచాట్లు.. గుండెలను పిండేసే పేదోడి హృదయఘోష.. ఇవే జగన్‌ మాటల్లో విన్పించాయి.

అందుకే ప్రతీ పేదవాడి గుండె ఆ క్షణం ఉద్వేగంతో ఉప్పొంగింది.. షాక్‌ కొట్టే కరెంట్‌ బిల్లులు.. చావు దగ్గరైనా దిక్కులేని పెన్షన్లు.. చదవించాలన్నా చేయూతనివ్వని సర్కార్‌.. చదువుకున్నా ఉపాధి కల్పించలేని వ్యవస్థ.. పేదవాడికి రోగమొస్తే ఆదుకోని పాలకులు.. వీటన్నింటి గురించి జననేత నిప్పులు చెరుగుతుంటే జనం ప్రతీమాటకు ప్రతిస్పందించారు. రెండు చేతులూ పైకెత్తి మద్దతు పలికారు. ‘మోసం చేసే ముఖ్యమంత్రి అవసరమా?’ అని జగన్‌ ప్రశ్నిస్తే ‘వద్దు.. వద్దంటూ...’ దిక్కులు పిక్కటిల్లేలా సమాధానమిచ్చారు. విశ్వసనీయత పెంచేందుకే వచ్చానని చెప్పినప్పుడు ఆత్మీయంగా చప్పట్లతో స్వాగతించారు. పేదల కోసం ఏదైనా చేస్తాడనే నమ్మకం.. బతుకుకు భరోసా ఇస్తాడనే ధైర్యం.. సభకొచ్చిన ప్రతీవ్యక్తిలోనూ కన్పించాయి.

జననేత సభకు ఫిరాయింపు ఎమ్మెల్యే అడుగడుగునా విఘ్నాలు కలిగించినా ప్రజాభిమానం చెక్కు చెదరలేదు. ఏ స్థాయిలో బెదిరించినా జనం భయపడలేదు. జననేత ఫ్లెక్సీలు చూసి ఈర్ష పడటమే కాదు.. గూడూరులో 150 ఫ్లెక్సీలు తీయించినట్టు జనం తెలిపారు. ఆఖరుకు ఓ చోట అభిమాని కట్టిన బెలూన్‌ను కూడా ఎమ్మెల్యే అనుచర గణం తొలగించడం గమనార్హం. అంతటితో ఆగకుండా పాదయాత్ర కోసం వచ్చే వారికి ఆశ్రయమే ఇవ్వొద్దని లాడ్జీల యజమానులను కూడా హెచ్చరించినట్లు ఫిర్యాదులొచ్చాయి. టీడీపీ నేతలు కాలనీల్లో మకాం వేసినా, జనం కసితో అభిమాన నేత కోసం తరలివచ్చారు. పాదయాత్రలో తిమ్మసముద్రం క్రాస్‌ నుంచి గూడూరు వరకూ వేలాది మంది జననేత అడుగులో అడుగు వేశారు. వందలాది మంది సమస్యలు చెప్పుకున్నారు.

Advertisement
Advertisement