గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీతో ఐదుగురికి తీవ్రగాయాలు

7 Oct, 2019 09:52 IST|Sakshi
ప్రమాదంలో కూలిన ఇల్లు (ఇన్‌సెట్‌); క్షతగాత్రుడిని పరామర్శిస్తున్న భద్రాద్రి జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య

పండితాపురంలో తెల్లవారుజామున లీకైన గ్యాస్‌ సిలిండర్‌

ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలు, కూలిన ఇల్లు

పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలింపు

ఆనందంగా పండుగ జరుపుకునేందుకు కుటుంబ సభ్యులందరూ సిద్ధమయ్యారు. రోజూలాగే రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. ఆ భయానికి చుట్టు పక్కలవారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్పటికే ఆ ఇంటి నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరు శబ్దం వచ్చిన ప్రదేశానికి చేరుకునేసరికి ఇల్లు కూలిపోయి ఉంది. ఇంట్లోని ఐదుగురు మంటల్లో కాలి, తీవ్ర గాయాలపాలై హాహాకారాలు చేస్తున్నారు. ఈ సంఘటన కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి పంచాయతీ పండితాపురంలో ఆదివారం తెల్లవారుజామున 3:30 నుంచి 4 గంటల మధ్య చోటుచేసుకుంది.  

సాక్షి, కామేపల్లి: గ్యాస్‌ సిలిండర్‌ లీకై ఐదుగురు తీవ్రంగా గాయపడడంతోపాటు ఇల్లు కూలిపోయింది. గ్రామస్తుల కథనం మేరకు.. బోయినపల్లి ఉపేంద్రమ్మ తన కూతురు వంగా నాగమణి, మనుమళ్లు పల్లె నగేష్‌బాబు, మందా శ్రీనాథ్, మందా వినయ్‌కుమార్‌ ఇంట్లో నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున ఉపేంద్రమ్మ మనుమడు లేచి కరెంట్‌ స్విచ్‌ ఆన్‌చేశాడు. అప్పటికే గ్యాస్‌ సిలిండర్‌ లీకవుతుండడంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని భారీ శబ్దాలు వచ్చాయి.  ఈ ఘటనలో  ఇల్లు కూలిపోయింది.  శబ్దానికి ఇరుగుపొరుగు వారు కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భయాందోళనకు గురయ్యారు. తేరుకునేసరికి ఉపేంద్రమ్మ ఇంటి నుంచి కేకలు వినిపిస్తున్నాయి. అక్కడకు వెళ్లి చూడగా ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. శరీరం కాలిపోయి ఆర్తనాదాలు చేస్తున్నారు. వెంటనే వారిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. 108 అంబులెన్స్‌ ద్వారా ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

బోయినపల్లి ఉపేంద్రమ్మ 65 శాతం, వంగా నాగమణి 43 శాతం, పల్లె నగేష్‌బాబు 90 శాతం, మందా వినయ్‌కుమార్‌ 65 శాతం, మందా శ్రీనాథ్‌ 70 శాతం వరకు శరీరం కాలిపోయింది. ఉపేంద్రమ్మ కుమార్తె వంగా నాగమణి ప్రస్తుతం 6 నెలల గర్భవతి. ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం పొందుతున్న క్షతగాత్రులను ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ, భద్రాది  జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మేకల మల్లిబాబుయాదవ్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అంతోటి అచ్చయ్య పరామర్శించారు. ఎమ్మెల్యే హరిప్రియ వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దీంతో వెంటనే హైదరాబాద్‌ నిమ్స్‌కు రిఫర్‌ చేయమని చెప్పడంతో క్షతగాత్రులను వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. క్షతగాత్రులను ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు