శ్మశానంలా జైలు.. తెగిపడ్డ తలలు

30 Jul, 2019 10:46 IST|Sakshi

రియో డి జెనిరో : బ్రెజిల్‌లోని ఆల్టామిరా జైలులో రెండు గ్యాంగుల మధ్య ఘర్షణ నరమేధానికి దారి తీసింది. జైలు గార్డులను ఓ గదిలో బంధించిన అనంతరం ఖైదీలు పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనలో సుమారు 57 మంది మరణించారు. ప్రత్యర్థుల దాడిలో 16 మంది తలలు తెగిపడగా.. మరికొంత మంది అగ్నికి ఆహుతి అయ్యారు. కాలిపోయిన శరీర భాగాలు, తల లేని మొండాలతో జైలు శ్మశానాన్ని తలపించింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కాగా పాత కక్షలతోనే జైలులో గ్యాంగ్‌వార్‌ జరిగినట్లు జైలు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో సంప్రదాయ ఫాసిస్ట్‌ నాయకుడు, బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయర్‌ బోసా నారు(63) పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన బ్రెజిల్‌ న్యాయ మంత్రిత్వ శాఖ దాడికి గల కారణాలు అన్వేషించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ఇక బ్యాంకు దొంగతనాలు, సెల్‌ఫోన్ల స్మగ్లింగ్‌, తుపాకులు, డ్రగ్స్‌ రవాణా తదితర నేరాల్లో అరెస్టైన దాదాపు సుమారు 7 లక్షల యాభై వేల మంది బ్రెజిల్‌ (ఖైదీలను కలిగి ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే మూడో స్థానం )జైళ్లలో మగ్గుతున్నారు. అక్కడే గ్రూపులుగా ఏర్పడిన ఖైదీల్లో నాయకత్వ లక్షణాలు కలిగి ఉండే వ్యక్తులు తమ గ్రూప్‌ సభ్యుడికి సౌకర్యాలు అందించేందుకు, ప్రత్యర్థి గ్యాంగుల నుంచి తమ వారిని రక్షించేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా బ్రెజిల్‌ జైళ్లలో రక్తపాతం జరుగుతూనే ఉంది. అయితే నేరస్తులకు కఠిన శిక్షలు అమలు చేసేలా తీసుకువచ్చిన బిల్లు కాంగ్రెస్‌లో ఇంతవరకు ఆమోదానికి నోచుకోకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు