జిషా కేసు.. ఇస్లాంను దోషిగా తేల్చిన కోర్టు

12 Dec, 2017 12:34 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం : ఒక్క కేరళలోనే కాదు.. యావత్‌ దేశంలో సంచలనం సృష్టించిన జిషా హత్యాచార కేసులో కేరళ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితుడు అమీర్‌ ఉల్‌ ఇస్లాంను దోషిగా కోర్టు నిర్ధారించింది. శిక్ష ఇంకా ఖరారు చెయ్యలేదు. 

కాగా, మృగ పైశాచిక చేష్టలకు సాక్ష్యంగా నిలిచిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఎర్నాకులం జిల్లా పెరంబవూర్‌ నుంచి కురుప్పామ్‌పడి లో స్థిరపడింది జిషా కుటుంబం. న్యాయ విద్యార్థి అయిన 30 ఏళ్ల  జిషా గతేడాది ఏప్రిల్‌ 28న కెనాల్‌ బండ్‌లో ఉన్న ఆమె ఇంట్లోనే అతి కిరాతకంగా హత్యాచారానికి గురైంది. వాంఛ తీర్చుకోవడానికి ఆమెను అతి కిరాతకంగా హింసించి చంపారు. మర్మాంగాలతోసహా శరీరంపై కత్తితో 30 పొట్లు పొడిచారు. ఆ సమయంలో ఆమె తల్లి, సోదరి ఇంట్లో లేరు. ఇంట్లోంచి అరుపులు వినిపిస్తున్నా స్థానికులు స్పందించలేదు.

ఘటన తర్వాత కేరళ అగ్నిగుండగా మారింది. ఇంట్లో ఉన్న మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపించాయి. ఈ దాషీక్టంపై మహిళా, ప్రజా సంఘాలు రోడెక్కి ఆందోళన చేపట్టాయి. పైగా బాధితురాలు దళిత వర్గానికి చెందటంతో అది మరింత ఉధృతం అయ్యింది. కేసు పురోగతిలో జాప్యం జరగటంతో ప్రభుత్వంపై కేరళ ప్రజానీకం మండిపడింది.  చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వ ఓటమికి ప్రత్యక్షంగా ఓ కారణం కూడా అయ్యింది. 

పోలీసులు ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేయగా.. ఘటన జరిగిన రెండు నెలల తరువాత తమిళనాడు కాంచీపురంలో అస్సాంకు చెందిన అమీర్ ఉల్‌ ఇస్లాం ను పోలీసులు అరెస్టు చేశారు. కూలీ పనులు చేసుకునే అతను మద్యం మత్తులోనే ఆ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. హత్య అనంతరం అమీర్ కాంచీపురానికి పారిపోయి అక్కడ ఉద్యోగం చేశాడు. అతని గది నుంచి హత్యకు వాడిన మారణాయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

మొత్తం 1500 పేజీల ఛార్జీ షీట్‌ను గతేడాది సెప్టెంబర్‌లోనే కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో తొలుత సబు అనే వ్యక్తి పేరు తెరపైకి రాగా.. కారణం ఏంటో తెలీదుగానీ అతను ఈ ఏడాది జూలై లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక మరో వ్యక్తి స్కెచ్‌ను పోలీసులు విడుదల చేయగా.. అతను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.  ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఏడీజీపీ సంద్య ఆధ్వర్యంలో మళ్లీ విచారణకు ఆదేశించింది. 290 పేజీల డాక్యుమెంట్లు, 36 మెటీరియల్‌ సాక్ష్యాలు, ఐదుగురు సాక్ష్యుల విచారణ.. ఫోరెన్సిక్‌ నివేదిక తదితరాలు ఇస్లాం తప్పు  చేసినట్లు తేల్చాయి. ఇక ఏప్రిల్‌ 4, 2017న ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. తన క్లయింట్‌ను కేసులో ఇరికించారని ఇస్లాం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. చివరకు నేరం తనే చేశానని గతంలో ఒప్పుకున్న స్టేట్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకున్న ఎర్నాకులం సెషన్స్ కోర్టు అమీర్ ఉల్‌ ఇస్లాంను దోషిగా తేల్చింది. 
 

మరిన్ని వార్తలు