బాసిత్‌ కోణంలోనూ ఆంద్రాబీ విచారణ?

11 Jun, 2019 02:57 IST|Sakshi
అబ్దుల్లా బాసిత్, అసియా ఆంద్రాబీ

ఎన్‌ఐఏ కస్టడీలో కశ్మీర్‌ వేర్పాటువాద నాయకురాలు 

గతంలో రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లిన వైనం

సాక్షి, హైదరాబాద్‌:  కశ్మీర్‌ వేర్పాటువాద సంస్థ దుక్త్రాన్‌–ఏ–మిల్లత్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు అసియా ఆంద్రాబీని నగరవాసి అబ్దుల్లా బాసిత్‌ కోణంలోనూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు విచారించనున్నారని తెలిసింది. ఆమె ఉగ్రవాద కార్యకలాపాలకు అవసరమైన నిధుల సమీకరణ కేసులో అరెస్టు అయి, ప్రస్తుతం ఎన్‌ఐఏ ఢిల్లీ యూనిట్‌ అదుపులో ఉన్నది. ఈమెకు నగరంతోనూ కొన్నిలింకులు ఉన్నాయి. 2015లో నగరంలో చిక్కిన బాసిత్‌ నేతృత్వంలోని ‘ఐసిస్‌ త్రయం’సైతం కశ్మీర్‌ వెళ్లి ఈమెను కలవడానికి ప్రయత్నాలు చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు కనుగొన్నారు.

ఉగ్ర నిధుల కేసులో ఎన్‌ఐఏ అధికారులు ఈ నెల 4న అసియా ఆంద్రాబీతోపాటు ముసరత్‌ ఆలం, షాబీర్‌ షాలను అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం పది రోజులపాటు వీరిని ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. అప్పట్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిద్ధ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా(సిమి) జాతీయ మాజీ అధ్యక్షుడు సయ్యద్‌ సలావుద్దీన్‌ కుటుంబాన్ని 2014లో నగరంలో ఆమె పరామర్శించి వెళ్లినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి.

ఐసిస్‌లో చేరేందుకు సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న అబ్దుల్లా బాసిత్‌(గత ఏడాది మళ్లీ అరెస్టు అయ్యాడు) సయ్యద్‌ ఒమర్‌ ఫారూఖ్‌ హుస్సేనీ, మాజ్‌ హసన్‌ ఫారూఖ్‌లను 2015 డిసెంబర్‌లో సిట్‌ పోలీసులు నాగ్‌పూర్‌ విమానాశ్రయంలో పట్టుకున్నారు. ‘సిమి’సలావుద్దీన్‌కు బంధువులైన వీరు నాగ్‌పూర్‌ నుంచి విమానంలో శ్రీనగర్‌ వెళ్లి అసియాను కలవాలనే ఉద్దేశంతో బయలుదేరారనే విష యం వెలుగులోకి వచ్చింది. ఈమె కుమారుడు సైతం నగరంలోని ఓ విద్యాసంస్థలో విద్యనభ్యసించాడు.

ఈ నేపథ్యంలోనే 2012లోనూ ఆంద్రాబీ ఓసారి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారని సమాచారం. పాక్‌ అనుకూలవాదిగా ముద్రపడ్డ ఆంద్రాబీ 2015 సెప్టెంబర్‌లో కశ్మీర్‌లో పాకిస్తాన్‌ జాతీయ జెండాలను ప్రదర్శించి వివాదాస్పదమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన శ్రీనగర్‌ పోలీసులు ఆమెను అరెస్టు కూడా చేశారు. 2016లో ఓ సందర్భంలో జాతీయ మీడియాతో మాట్లాడిన అసియా హైదరాబాద్‌ వచ్చి సలావుద్దీన్‌ కుటుంబాన్ని పరామర్శించినట్లు అంగీకరించారు. తాజాగా ‘అబుదాబి మాడ్యుల్‌’ కేసులో గత ఏడాది బాసిత్‌ అరెస్టు కావడం, ఇప్పుడు ఆంద్రాబీ సైతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉండటంతో ఆమెను బాసిత్‌కు సంబంధించిన వివరాలపై ప్రశ్నించే అవకాశం ఉందని తెలిసింది. 

మరిన్ని వార్తలు