కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య

27 Dec, 2018 04:29 IST|Sakshi

ఐఐటీ కోసం కోచింగ్‌ తీసుకుంటున్న జితేశ్‌

ఐదు రోజుల్లో మూడో ఘటన

కోట: ఐఐటీ కోచింగ్‌ తీసుకుంటున్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోటలో చోటు చేసుకుంది. బిహార్‌ శివాన్‌ జిల్లాలోని హర్దోబరకు చెందిన జితేశ్‌ (17) గుప్తా ఐఐటీ–జేఈఈ ప్రవేశ పరీక్ష కోసం మూడేళ్లుగా ఇక్కడి ఇన్‌స్టిట్యూట్‌లో సన్నద్ధం అవుతున్నాడు. మంగళవారం హాస్టల్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మహావీర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై ఈశ్వర్‌ సింగ్‌ వెల్లడించారు. కాగా ఐదు రోజుల్లో ఇది మూడో ఆత్మహత్య కావడం గమనార్హం. ‘జితేశ్‌ తల్లిదండ్రులు అతనికి ఫోన్‌ చేయగా అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు తన స్నేహితునికి ఫోన్‌ చేశారు.

కిటికీలోంచి జితేశ్‌ ఫ్యాన్‌కు వేలాడి ఉండటం చూసిన అతని స్నేహితుడు అధికారులకు సమాచారం అందించాడు’అని తెలిపారు. అయితే పోలీసులు జితేశ్‌ ఆత్మహత్యకు గల కారణాలకు సంబంధించి ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభ్యం కాలేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్‌కు చెందిన దీక్షా సింగ్‌ (17) అనే నీట్‌ విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మరో ఐఐటీ అభ్యర్థి దీపక్‌ దదీచ్‌ (16) శనివారం మధ్యాహ్నం కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాదిలో కోటలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య జితేశ్‌తో కలిపి 19 మందికి చేరింది.

మరిన్ని వార్తలు