ఏసీబీ వలలో అసిస్టెంట్‌ పెన్షన్‌ ఆఫీసర్‌

12 Jul, 2019 08:58 IST|Sakshi
పోలీసుల అదుపులో కేపీనాయక్‌

మల్కాజిగిరి: పెన్షన్‌ బకాయిలు విడుదల చేసేందుకు లంచం డిమాండ్‌ చేసిన అసిస్టెంట్‌ పెన్షన్‌ ఆఫీసర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ బీవీ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తార్నాకలోని ప్రశాంత్‌నగర్‌ రైల్వే క్వార్టర్స్‌లో పెన్సన్‌ పేమెంట్‌ కార్యాలయంలో బీఎన్‌ రెడ్డి నగర్‌కు చెందిన కేపీ నాయక్‌ అసిస్టెంట్‌ పెన్సన్‌ పేమెంట్‌ అధికారిగా పనిచేస్తున్నాడు. మల్కాజిగిరికి చెందిన అనూషాబాయి భర్త ఆర్‌.సుబ్బూలాల్‌ ఆర్‌ అండ్‌బీ విభాగంలో రికార్డ్‌ అసిస్టెంట్‌ గా పనిచేస్తూ 2012 సెప్టెంబర్‌లో మృతి చెందాడు. తన భర్త పెన్షన్‌ బకాయి రూ.1.10 లక్షలు విడుదల చేయాలని కోరుతూ ఆమె కె.పి.నాయక్‌ను సంప్రదించింది. అయితే బకాయిలు విడుదల చేయాలంటే అందులో 15 శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాను అంత ఇవ్వలేనని రూ.7 వేలు ఇస్తానని చెప్పడంతో కేపీ నాయక్‌ అందుకు అంగీకరించాడు. ఈ నెల 8న అనూషాబాయి తన కుమారుడు కిరణ్‌కుమార్‌తో కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం గురువారం మధ్యాహ్నం కార్యాలయంలో కిరణ్‌కుమార్‌ నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి కేపీ నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, రవీంద్రారెడ్డి, రఘునందన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు