అశ్లీల చిత్రాలతోనే మహిళలపై దాడులు

14 May, 2018 11:36 IST|Sakshi
మాట్లాడుతున్న శిరోమణి

ఖమ్మంమయూరిసెంటర్‌ : అశ్లీల చిత్రాలు, అశ్లీల సాహిత్యం, మద్యం వల్లనే మహిళలు, యువతుల పై దాడులు జరుగుతన్నాయని, యువత పెడదారి పడుతున్నారని ప్రగతి శీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) జిల్లా కార్యదర్శి సీహెచ్‌ శిరోమణి ఆరోపించారు. ఆదివారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు లలిత అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శిరోమణి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పసిమొగ్గలపై అత్యాచారాలు జరిపి హత్యగా చిత్రీకరించడం పెరిగిపోయిందన్నారు. కతువా, ఉన్నావ్‌లలో బాలికలపై జరిగిన దారుణాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఉన్నావ్‌లో బీజేపీ ఎమ్మెల్యే బాలికపై అత్యాచారం చేశారని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలు, యువతులు, బాలికలపై అత్యాచార దాడులు పెరిగాయని ఆరోపించారు.

బాలికలపై అత్యాచారాలు చేస్తే ఉరిశిక్ష వేస్తే నేరాలు ఆగవని, శిక్షను అమలు చేయడంతోపాటు సమాజంలో యువతను పెడదారి పట్టిస్తున్న అశ్లీల చిత్రాలను నిలిపివేయాలని పేర్కొన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.ఝాన్సీ, శిరీష, స్వరూప, సరోజిని, కోటమ్మ, వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు