అంగట్లో అమ్మేస్తున్నారు!

27 Nov, 2017 02:12 IST|Sakshi
నిర్బంధ కేంద్రాల్లో ఉన్న ఆఫ్రికన్లు, వేలానికి సిద్ధంగా..

     లిబియాలో అమానవీయం

     బానిసలుగా పేద ఆఫ్రికన్ల వేలం 

     యూరప్‌కు శరణార్థులుగా తరలే వారిపై అక్రమ రవాణా ముఠాల వల

     గమ్యం చేరుస్తామనే సాకుతో నిర్బంధం

     గాలి, వెలుతురులేని గోదాముల్లో ఉంచి చిత్రహింసలు

     కుటుంబాలకు ఫోన్లు చేసి వారి విడుదలకు బేరాలు

     చెల్లించకుంటే పదే పదే వేలం ∙విలవిల్లాడుతున్న వేలాది మంది

     ఘోరాన్ని బయటపెట్టిన సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థ

మనుషుల వేలం... మీరు చదివింది నిజమే. మధ్యయుగాలను గుర్తుకుతెస్తూ... 2017లో లిబియా రాజధాని ట్రిపోలీలో సాగుతున్న అమానవీయ వేలం. బానిసలుగా మనుషులను అమ్ముతున్న దారుణం. వేలాది మంది ఆఫ్రికన్లను అమ్ముతూ అక్రమ రవాణా ముఠాలు సాగిస్తున్న దందా. ఈ ఉదంతాలను ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ సీఎన్‌ఎన్‌ రహస్యంగా చిత్రీకరించి ప్రపంచం ముందుంచింది.     
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

ఎవరు వీరు... 
పశ్చిమాఫ్రికా, మధ్య ఆఫ్రికా దేశాల్లో పేదరికం, అంతర్గత కలహాలు, అస్థిరత కారణంగా... బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ యూరప్‌కు పయనమవుతుంటారు శరణార్థులు. బంగ్లాదేశీలు కూడా ఎక్కువే ఉంటారు. వారు రోడ్డు మార్గం ద్వారా దేశాల సరిహద్దులను అక్రమంగా దాటుతూ లిబియాకు చేరుకుంటారు. లిబియా నుంచి ఇటలీ, ఇతర యూరప్‌ దేశాలకు చేరుకొని కొత్త జీవితం గడపాలనేది వారి ఆశ. దీనికోసం మనుషులను అక్రమంగా రవాణా చేసే ముఠాలకు భారీ మొత్తంలో సొమ్ము చెల్లిస్తుంటారు. లిబియా చేరుకున్నాక చిన్నచిన్న పడవల్లో కిక్కిరిసి ప్రయాణిస్తూ ప్రాణాలకు తెగించి మధ్యధరా సముద్రం దాటే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వేల మంది సముద్రంలో మునిగి చనిపోతుంటారు. స్వచ్ఛంద సంస్థలు నడిపే బోట్లు కొందరిని కాపాడుతున్నాయి. అక్రమ వలసదారులు, శరణార్థుల తాకిడి ఎక్కువై... యూరప్‌ దేశాలు తమ తీర ప్రాంతాల్లో గస్తీ పెంచాయి. దీంతో అదృష్టంకొద్దీ యూరప్‌ తీరానికి చేరినా... అక్కడ పట్టుబడి తిరిగి స్వదేశానికి వస్తుంటారు. 

ఎక్కడెక్కడ... 
మధ్యధరా తీరానికి సమీపంలో ఉన్న జువారా, సబ్రాత్, కాసిల్‌వెర్డే, గర్యాన్, అల్‌రుజ్బాన్, అల్‌జింటాన్, కబావ్, గడామిస్‌... తదితర పట్టణాల్లో ఈ ముఠాలు ప్రైవేటు నిర్బంధ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. యూరప్‌కు చేర్చుతామని ఒప్పందం కుదుర్చుకొని తెచ్చిన వారిని నిర్బంధిస్తున్నాయి. ఇచ్చిన మొత్తం ప్రయాణానికి సరిపోవడం లేదని, మధ్యవర్తులు వారి తాలూకు మొత్తం డబ్బును తమకు చెల్లించలేదని... సాకులు చూపుతారు. గాలి, వెలుతురు సరిగాలేని గోదాముల్లో ఆఫ్రికన్లను కుక్కుతారు. వాటిల్లో కనీస సదుపాయాలుండవు. సరిగా తిండి కూడా పెట్టరు. ఎదురుతిరిగితే చిత్రహింసలే. ఇలా నిర్బంధించిన వారి ఇళ్లకు ఫోన్లు చేస్తూ... తాము చెప్పినంత డబ్బు చెల్లిస్తే మీ వాడిని విడిచిపెడతామని బేరం పెడతారు. అలా డబ్బు గుంజుతారు. అప్పటికే ఉన్నదంతా ఊడ్చి వాళ్ల చేతిలో పెట్టిన నిర్భాగ్యులు ఏమీ చెల్లించకపోతే... వారిని బానిసల వేలం మార్కెట్లలో అమ్మేస్తారు. పులులను బోన్లలో పెట్టినట్లు... వారిని ప్రదర్శనకు పెట్టి వేలం వేస్తారు. నియమిత కాలానికి వేలం వేసి... ఆ సమయం ముగిశాక మళ్లీ వెనక్కితెస్తారు. వేలంలో వచ్చిన దానితో బాకీ తీరలేదని చెప్పి మళ్లీ వేలానికి పెడతారు. 

ఎంత మంది... 
ప్రస్తుతం లిబియాలో 7 లక్షల నుంచి 10 లక్షల మంది శరణార్థులు ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా. మొత్తం 25,000 మంది లిబియా ప్రభుత్వం నిర్వహిస్తున్న శరణార్థి కేంద్రాల్లో ఉన్నారు. వారిని స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నా... వారి మాతృదేశాలు సహకరించడం లేదని లిబియా ఆరోపణ. లిబియాలోని దుర్భర పరిస్థితులను చూశాక... స్వదేశానికి తిరిగి వెళ్లడానికి 8,800(ఈ ఏడాది ఇప్పటివరకు) మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ సంస్థ తెలిపింది. సీఎన్‌ఎన్‌ చిత్రీకరించి ప్రసారం చేసిన వీడియోతో ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో బానిసల వేలంపై దర్యాప్తు జరుపుతామని లిబియా ప్రభుత్వం ప్రకటించింది. 

మానవత్వానికే మచ్చ 
శరణార్థులకు బానిసలుగా అమ్ముతున్నారనే విషయం భీతిగొల్పుతోంది. ఇది మానవత్వానికే మచ్చ. అంతర్జాతీయ సమాజం  దీన్ని అడ్డుకోవాలి. చట్టపరమైన వలసలను ప్రోత్సహించాలి.    
    – అంటోనియో గుటెరస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ 

నన్ను అమ్మారు... 
నైజీరియాలో పెచ్చరిల్చిన అవినీతి, పేదరికంతో యూరప్‌కు వలస వెళ్లాలని ఇంటిని వీడాను. లక్షా 80 వేల రూపాయలు స్మగ్లర్ల చేతుల్లో పోశాను. లిబియాలో నరకం చూపించారు. నన్ను పలుమార్లు వేలం వేశారు. మా ఇంటికి ఫోన్‌ చేసి డబ్బు చెల్లించాల న్నారు. చివరకు నన్ను వదిలేశారు.     
– 21 ఏళ్ల విక్టరీ, నైజీరియన్‌ 

900  దినార్లు... 
నా పాట 1,000 
1,100  మరొక బిడ్డర్‌ 
1,200  లిబియా దినార్లు...

ఓకే...డీల్‌ డన్‌ 
ఇది ఏ పాత కారో, ఫర్నిచరో, కొద్ది గజాల స్థలానికో జరిగిన వేలంపాట కాదు... 
ఇద్దరు నల్లజాతీయులను బానిసలుగా కొనుక్కోవడానికి వారి కొత్త యజమాని 1,200 లిబియా దినార్లు (రూ.52 వేలు) చెల్లించేందుకు పాడిన పాట ఇది. 
‘కందకాలు తవ్వడానికి మనిషి కావాలా? ఇదిగో బలిష్టుడు, ఆజానుబావుడు... బాగా పనికొస్తాడు.’వేలం వేస్తున్న వ్యక్తి తాను అమ్ముతున్న ‘సరుకు’ గురించి చేస్తున్న వర్ణనిది.

లిబియానే ఎందుకు? 
2011లో లిబియాలో ప్రజా తిరుగుబాటుతో నియంత గడాఫీ హతమయ్యాక ఆ దేశంలో అస్థిరత నెలకొంది. ఐక్యరాజ్యసమితి అండతో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నా... దేశమంతటా దీని పాలన లేదు. దీంతో మనుషులను అక్రమ రవాణా చేసే ముఠాలు లిబియాను కేంద్రంగా చేసుకొని దందా సాగిస్తున్నాయి. యూరో కలలుగంటున్న పేద ఆఫ్రికన్ల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. 

మరిన్ని వార్తలు