Libya Floods: లిబియాలో ఊహకందని మహా విషాదం..5,100 దాటిన మృతులు

14 Sep, 2023 03:05 IST|Sakshi
డెర్నా: వరద రాక ముందు..; డెర్నా: వరద తర్వాత..

ఇంకా వేలాది మంది జాడ గల్లంతు !

నగరంలో ఎటుచూసినా శవాలే

రహదారులు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం

డెర్నా: అస్థిర ప్రభుత్వాలు, సంక్షోభం, ఎవరికీ పట్టని ప్రజా సంక్షేమంతో సమస్యల వలయంలో చిక్కిన లిబియాపై ప్రకృతి కత్తి గట్టింది. ఊహించని వరదలు, వరద నీటి ధాటికి పేకమేడల్లా కుప్పకూలిన రెండు డ్యామ్‌లు.. వరద విలయాన్ని మరింత పెంచాయి. డ్యామ్‌ల నుంచి దూసుకొచ్చిన నీటిలో కొట్టుకుపోయి జలసమాధి అయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటి గణాంకాల ప్రకారం డెర్నా సిటీలో వరద మృతుల సంఖ్య ఏకంగా 5,100 దాటింది.

ఇంకా వేలాది మంది జాడ గల్లంతయిందన్న కథనాలు చూస్తుంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వరద ఉధృతికి ఇళ్లుసహా సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారు వేలాదిగా ఉన్నారు. డెర్నా సిటీ తీరప్రాంతంలోని పర్వతాలు, లోయలతో నిండిన నగరం. వరదల కారణంగా చాలా రోడ్లు దెబ్బతిని సహాయక బృందాలు వరద ముంపు ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి. దీంతో చాలా చోట్ల సహాయక చర్యలు మొదలేకాలేదు. అతికష్టం మీద కొన్ని బృందాలు చేరుకుని జలమయమైన ఇళ్లలో బాధితుల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. నేలమట్టమైన భవనాలు, శిథిలాల కింద వెతికే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.

30 వేలు దాటిన వలసలు
వరద ధాటికి సర్వం కోల్పోవడంతో దాదాపు 30 వేల మంది స్థానికులు పొట్టచేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసవెళ్లారని ఐక్యరాజ్యసమితికి చెందిన మైగ్రేషన్‌ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ సంఖ్య 40,000కుపైనే ఉంటుందని ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ లిబియా ప్రతినిధి తమెర్‌ రమదాన్‌ అంచనావేశారు.

రెండు ప్రభుత్వాల మధ్య నలిగి..
తూర్పు ప్రాంతంలో ఒక ప్రభుత్వం, మరో దిశలో ఇంకో ప్రభుత్వాల నిర్లక్ష్య ఏలుబడిలో ఉన్న లిబియాలో మౌలిక వసతుల కల్పన అరణ్యరోదనే అయ్యింది. ‘నగరంలో ఉన్న ఏకైక శ్మశానానికి తరలించేందుకు మృతదేహాలను ఒక దగ్గరకు చేరుస్తాం. ఈ జల విలయంలో 11 మంది కుటుంబసభ్యులను కోల్పోయి గుండెలవిసేలా రోది స్తున్న ఒకాయనను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు’ అని సహాయక బృంద సభ్యుడొకరు చెప్పారు. ‘ నా కుటుంబం మొత్తాన్నీ కోల్పోయా. వరదల్లో మా వాళ్ల మృతదేహాలు సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి’ అని అబ్దల్లా అనే వ్యక్తి వాపోయారు. రోడ్లలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు బుల్డోజర్లుతో రెండు రోజులుగా నిరంతరంగా పనిచేయిస్తున్నారు. అప్పుడుగానీ అత్యవసర సరుకుల్ని తరలించలేని దుస్థితి.

వేరే పట్టణాలకు మృతదేహాల తరలింపు
సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించే పరిస్థితు లు డెర్నీ సిటీలో కరువవడంతో వందలాది మృతదేహా లను సమీపంలోని పట్టణాలకు తరలిస్తున్నారు. మరణించిన వారిలో 84 మంది ఈజిప్టువాసులూ ఉన్నారు. దక్షిణాన ఉన్న బెనీ సుయెఫ్‌ రాష్ట్రంలో ఎల్‌–షరీఫ్‌ గ్రామంలో డజన్లకొద్దీ ఈజిప్షియన్లు జలసమాధి అయ్యారు.

డెర్నాలో భీతావహ దృశ్యం
నగరంలో చాలా చోట్ల మృతదేహాలు కనపడుతు న్నాయి. బురదనీటిలో కూరుకుపోయి, వీధుల్లోకి కొట్టుకొచ్చి, సముద్ర తీరం వెంట.. ఇలా చాలా ప్రాంతాల్లో స్థానికులు విగతజీవులై కనిపించారు. ఒక్కసారిగా నీరు రావడంతో ఎటూ తప్పించుకోలేని నిస్సహాయక స్థితి. ‘నగరంలో ఏ ప్రాంతంలో సహాయం చేసేందుకు వెళ్లినా అక్కడ మాకు చిన్నారులు, మహిళల మృతదేహాలే కనిపిస్తున్నాయి’ అని బెంఘాజీకి చెందిన ఒక సహాయకుడు ఫోన్‌లో మీడియా సంస్థకు చెప్పారు. ‘సిటీ శివార్లలోని డ్యామ్‌ బద్దలైన శబ్దాలు మాకు వినిపించాయి. నగరం గుండా ప్రవహించే వాదీ డెర్నీ నదిలో ప్రవాహ ఉధృతి అమాంతం ఊహించనంతగా ఎగసి జనావాసాలను ముంచేసింది.

‘ డ్యామ్‌ బద్దలవడంతో ఏకంగా ఏడు మీటర్ల ఎత్తులో దూసుకొచ్చిన ప్రవాహం తన మార్గంలో అడ్డొచ్చిన అన్నింటినీ కూల్చేసింది’ అని లిబియాలో రెడ్‌ క్రాస్‌ కమిటీ ప్రతినిధి బృంద సారథి యాన్‌ ప్రైడెజ్‌ చెప్పారు. మధ్యధరా ప్రాంతంలో సన్నని తీరప్రాంతంలో పర్వత పాదాల చెంత ఈ నగరం ఉంది. పర్వతాల నుంచి వచ్చిన వరద నీరు నగరాన్ని ముంచేస్తూ తీరం వైపు కిందకు ఉరకలెత్తడంతో వరద తీవ్రత భయంకరంగా ఉంది. వరద ధాటికి దక్షిణం వైపు కేవలం రెండు రోడ్లు మాత్రమే మిగిలిపోయాయి. కూలిన వంతెనలు నగరం మధ్య భాగాన్ని రెండుగా చీల్చాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గాయపడిన ఏడు వేలకుపైగా స్థానికులను మైదానాల్లోని తాత్కాలిక వైద్యశాలల్లో చికిత్సనందిస్తున్నారని తూర్పు లిబియాలోని అంబులెన్స్, అత్యవసర కేంద్రం అధికార ప్రతినిధి ఒసామా అలీ చెప్పారు.

మరిన్ని వార్తలు