పోలీసుల దాష్టీకానికి మ‌రో వ్య‌క్తి బ‌లి

29 Jun, 2020 14:14 IST|Sakshi

చెన్నై: పోలీసుల క‌స్ట‌డీలో తండ్రీ కొడుకులు(జయరాజ్‌, బెనిక్స్) మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌పై దేశ వ్యాప్తంగా ఆగ్ర‌హ జ్వాల‌లు చ‌ల్లార‌టం లేదు. ఈ దారుణాన్ని మ‌రువ‌క‌ముందే త‌మిళ‌నాడులో మ‌రో ఉదంతం చోటు చేసుకుంది. టెంకాశీ జిల్లాకు చెందిన‌ ఓ వ్య‌క్తి పోలీసుల దెబ్బ‌లు తాళ‌లేక శ‌నివారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని త‌ల‌పించ‌డంతో రాష్ట్రంలో పోలీసుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ‌టెంకాశీకి చెందిన‌ కుమారేశ‌న్‌(30) ఆటో న‌డుపుకుంటున్నాడు. గ‌త నెల ఓ వివాదం కేసులో పోలీసులు అత‌డికి స‌మ‌న్లు ఇచ్చారు. దీంతో మే 10న‌ పోలీస్ స్టేష‌న్‌లో హాజ‌రైన‌ కుమారేశ‌న్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టార‌ని బాధిత తండ్రి అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. తొడ‌ల‌పై నిల‌బ‌డి, పిడిగుద్దులు కురిపిస్తూ, బూట్ల‌తో తన్నుతూ, లాఠీలతో కొడుతూ చిత్ర‌హింస‌లు పెట్టార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. (ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్‌’లు)

తీవ్ర గాయాల‌పాలైన అత‌డిని తొలుత ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం తిరున‌ల్వేలి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా చికిత్స తీసుకుంటూ శ‌నివారం తుదిశ్వాస విడిచాడు. పోలీసులు తీవ్రంగా హింసించార‌ని, ఆ దెబ్బ‌లు తాళ‌లేకే మ‌ర‌ణించాడ‌ని బాదిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై ఆగ్రహం వ్య‌క్తం చేసిన‌ బాధితుడి బంధువులు ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. మ‌రోవైపు దీన్ని అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌, ఓ కానిస్టేబుల్‌ను అనుమానితుల లిస్టులో చేర్చారు. దీనిపై ద‌ర్యాప్తు చేప‌డ‌తామ‌ని, నిందితులపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని టెంకాశీ పోలీసు అధికారి సుగ‌న సింగ్ తెలిపారు. (తండ్రీకొడుకుల అనూహ్య మరణం!)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు